సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయారు. సాధారణ ఎన్నికలు సమీపంలోనే ఉండటంతో.. బైఎలక్షన్ ఊసే లేదు. కానీ.. అధికారపార్టీ నాయకులు మాత్రం వేగంగా పావులు కదుపుతున్నారు. సమస్య పరిష్కారం కోసం పార్టీ పెద్దలు ప్రయత్నిస్తే.. తగ్గేదే లేదన్నారు కీలక నేతలు. దీంతో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆ సెగ్మెంట్‌లో రచ్చ రచ్చేనా..?
కంటోన్మెంట్ కీలక నేతలతో బీఆర్‌ఎస్ ముఖ్యుల భేటీ
అనారోగ్యంతో ఇటీవలే సికింద్రబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గడ్డం సాయన్న కన్నుమూశారు. దీంతో ఆ నియోజకవర్గంపై అధికారపార్టీ బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఏడాది చివర్లో షెడ్యూల్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో.. కంటోన్మెంట్‌లో పార్టీ బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎన్నికలకు సమాయత్తం అయ్యే క్రమంలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తోంది బీఆర్‌ఎస్. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్కడి గులాబీ నాయకులతో సమావేశం అయ్యారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. ఆశావహులుగా ఎవరైతే ఉన్నారో వారిని సమావేశానికి పిలిచారు. కంటోన్మెంట్‌లో ఆత్మీయ సమావేశాల నిర్వహణపై వారితో మాట్లాడారు మంత్రి. కానీ.. సమావేశంలో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందని చెబుతున్నారు.
ఇంఛార్జ్ పదవి కోసం నేతలు పట్టు
మంత్రి తలసాని నిర్వహించిన సమావేశానికి దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందితతోపాటు.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న ఎర్రోళ్ల శ్రీనివాస్, వివిధ కార్పరేషన్లకు ఛైర్మన్లగా ఉన్న గజ్జెల నగేష్, మన్నె క్రిశాంక్‌లను పిలిచారు. జిల్లా బీఆర్‌ఎస్ ఇంఛార్జ్ హోదాలో సమావేశంలో పాల్గొన్నారు దాసోజు శ్రవణ్. వచ్చే ఎన్నికలకు ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి చేయాల్సిన పనులేంటి.. తదితర అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. అయితే సమావేశం ఆసాంతం చాలా వాడీవేడిగా సాగినట్టు ప్రచారం జరుగుతోంది. ఎవరికి వారు టికెట్ తమకే కావాలని పట్టుబట్టడంతో సమావేశంలో ఏ అంశంపైనా ఏకాభిప్రాయం కుదరలేదని టాక్. దీంతో ఆత్మీయ సమావేశాల నిర్వహణ ఎలా అన్నది పార్టీ పెద్దలకు పెద్ద ప్రశ్నగా మారింది. కార్యక్రమాలు సరే.. ముందు నియోజకవర్గం ఇంఛార్జ్ ఎవరో తేల్చాలని నాయకులు డిమాండ్ చేసినట్టు సమాచారం.
ఎన్నికలకు ముందే అభ్యర్థి ప్రకటన అని తేల్చేసిన మంత్రి
గులాబీపార్టీలో మొదటి నుంచీ ఉన్న తమను ఇంఛార్జ్‌గా ప్రకటించాలని ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేష్ పట్టుబట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఇద్దరు నాయకులు పార్టీతో తమకున్న అనుబంధాన్ని, చేసిన కార్యక్రమాలను ఏకరవు పెట్టడంతో చర్చ వేడెక్కినట్టు తెలుస్తోంది. వాళ్లిద్దరూ సరే.. మరి నా సంగతేంటి అని మన్నె క్రిశాంక్ ప్రశ్నించారని చెబుతున్నారు. కంటోన్మెంట్‌లో తన తండ్రి ఎమ్మెల్యేగా చేయడంతో.. ఆ సీటును తనకే ఇవ్వాలని.. ఇంఛార్జ్‌గానూ తన పేరునే ప్రకటించాలని సాయన్న కుమార్తె లాస్య నందిత మంత్రి తలసానిని కోరినట్టు టాక్. ఇలా ఎవరికి వారు తమ వాదన వినిపించడంతో సమావేశం నిర్వహించిన పార్టీ నేతలకు ఏం తోచలేదని.. చివరకు అంతా కలిసి పనిచేయాలని సూచించి సమావేశం ముగించేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందే అభ్యర్థి ప్రకటన ఉంటుందని తేల్చేయడంతో సమావేశానికి వచ్చిన నలుగురు నేతలు ఉస్సూరు మన్నారు. తొలి సమావేశమే హాట్ హాట్‌గా సాగడంతో.. పరిష్కారం ఇక పార్టీ పెద్దల చేతిలోకి వెళ్లినట్టు అయ్యింది. ఆశావహులుగా ఉన్న నలుగురిలో ఒకరిని ఇంఛార్జ్‌ను చేస్తారా లేక కొత్త వారిని తెరపైకి తెస్తారా అనేదానిపై గులాబీ శిబిరంలో ఉత్కంఠ నెలకొంది.

