ఎవరి ట్రాప్‌లో ఎవరు పడ్డారు..? బనకచర్ల సవాళ్ళ పర్వంలో పైచేయి కాంగ్రెస్‌దా? బీఆర్‌ఎస్‌దా? అసెంబ్లీకి రావడం కేసీఆర్‌కు ఇష్టం లేకుంటే… నేనే ఫామ్‌హౌస్‌కి వస్తానని చెప్పడం ద్వారా సీఎం రేవంత్… మేటర్‌ని తనవైపునకు తిప్పుకున్నారా? రేవంత్ సవాల్‌కు గులాబీ పార్టీ సమాధానమేంటి? ఈ సవాళ్ళ పర్వంలో ఎవరి వెంట ఎవరు నడుస్తున్నారు? తెలంగాణ రాజకీయం మొత్తం గడిచిన వారం రోజులుగా… సవాళ్లు, ప్రతి సవాళ్ళ చుట్టూనే తిరుగుతోంది. తగ్గేదే లే అన్నట్టు అధికార, ప్రతి పక్షాల నేతలు ఎవరికి వారు తొడగొడుతూ రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. చూసే వాళ్ళకు ఇది ఎంటర్‌టైనింగ్‌గానే ఉన్నా…. ఇక్కడే ఒక సరికొత్త చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్‌లో. రాష్ట్రంలో ట్రాప్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్నది ఆ చర్చల సారాంశం. అసలు ఎవరి ట్రాప్‌లో ఎవరు పడ్డారంటూ రకరకాలుగా ఆసక్తికరమైన విశ్లేషణలు నడుస్తున్నాయి. బనకచర్ల ప్రాజెక్ట్‌విషయంలో సీఎం రేవంత్ విసిరిన సవాల్‌కి… బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించడం, ప్రెస్ క్లబ్‌లో చర్చిద్దాం…. రమ్మంటూ అక్కడికి వెళ్ళడం, దానికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి రియాక్ట్ అవుతూ… క్లబ్బులు… పబ్బులకి నేను రాను… చిత్తశుద్ధి ఉంటే…. అసెంబ్లీకి రండి…చట్టసభ వేదికగానే చర్చిద్దామని అనడంతో… మేటర్ మరింత రసవత్తరంగా మారిపోయింది.
అసెంబ్లీకి రమ్మనడంతోనే… ఊరుకోలేదు సీఎం. అందులో కూడా ప్రతిపక్షానికి భారీ డిస్కౌంట్స్ ఇవ్వడం ఇంకా రక్తి కట్టిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేసీఆర్‌కు ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి…. మంత్రులను ఫామ్‌హౌస్‌కు పంపిస్తా… మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం అని ప్రతిపాదించి….. దాదాపుగా బీఆర్‌ఎస్‌ని ఒక ఎడ్జ్‌కి నెట్టేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. అక్కడితో ఆగలేదు రేవంత్ రెడ్డి. అంతకు మించిన భారీ ఆఫర్…. ఇచ్చారని, ఇంకా చెప్పాలంటే…అది చూసి గులాబీ నాయకత్వానికి గొంతులో పచ్చివెలక్కాయ పడి ఉంటుందని విశ్లేషిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు. దాని ద్వారా… ముఖ్యమంత్రిని అయినా ప్రజా సమస్యలపై చర్చించేందుకు తనకు ఎలాంటి భేషజాలు లేవని సీఎం చెప్పినట్టు అయిందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఇంతకీ.. ఆ బంపరాఫర్ ఏంటంటే…. చర్చిద్దామని కేసీఆర్ ముందుకు వస్తే… తానే ఫామ్‌హౌస్‌కి వస్తాననడం. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే… చర్చ కోసం మంత్రులను ఫామ్‌హౌస్‌కు పంపుతానన్న ముఖ్యమంత్రి… ఒకవేళ కేసీఆర్ గనుక సీఎం వస్తేనే నేను మాట్లాడతానని అంటే…
ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కి రావడానికి నేను సిద్ధం అంటూ క్లారిటీగా చెప్పేశారు. ఇలా… ఈ వరుస ఎపిసోడ్స్ చూస్తుంటే… ఎవరి ట్రాప్‌లో ఎవరు పడ్డారన్న చర్చ జరుగుతోంది. సీఎం పన్నిన ఉచ్చులోకి బీఆర్‌ఎస్ వచ్చిందా..? లేక గులాబీ ట్రాప్‌లో కాంగ్రెస్ పడిందా అంటూ రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల రైతు భరోసా డబ్బును ఖాతాల్లో వేసింది. సన్నబియ్యంతో పేదలు హ్యాపీగా ఉన్నట్టు చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఐతే… బనకచర్ల విషయంలో మాత్రం బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గిల్లిందన్న అభిప్రాయం పెరుగుతోందట రాజకీయ వర్గాల్లో. ఆ విషయమై ప్రభుత్వం మొదట కొంత సైలెంట్ గా ఉండటంతో అధికార పార్టీని మరింత ఇరకటంలోకి నెట్టాలని చూసిందట గులాబీ పార్టీ. దీంతో రంగంలోకి దిగిన సీఎం రేవంత్… బనకచర్ల బ్యాక్‌గ్రౌండ్ చెప్పే క్రమంలో…మాజీ సీఎం కేసీఆర్ పాత వీడియోలను బయటికి తీశారు. రాయలసీమకి నీళ్ళ తరలింపుపై గతంలో ఆయన అన్న మాటల్ని చర్చకు పెట్టారు. ఆ ఎపిసోడ్‌తో సర్కార్ కొంత అప్పర్ హ్యాండ్ సాధించిందన్న అభిప్రాయం వచ్చింది. దాని ఆధారంగా….ప్రతిపక్షనేత కేసీఆర్‌ని అసెంబ్లీకి రప్పించే స్కెచ్ వేశారు ముఖ్యమంత్రి. గోదావరి…కృష్ణ బేసిన్లు… రైతు సంక్షేమంపై చర్చ పెడదామని సవాల్ విసిరారు. దీంట్లో ప్రతిపక్షం లైన్‌లోకి వచ్చేసింది. చర్చకు మేము రెడీ అన్నాక వేదిక అసెంబ్లీ కాస్తా… ప్రెస్ క్లబ్ గా మారింది. దీన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. ప్రెస్ క్లబ్‌లు కాదు… అసెంబ్లీకి రండి… ప్రతిపక్ష నాయకుడు సభకు రారా అనే చర్చను జనంలో పెట్టగలిగింది కాంగ్రెస్ పార్టీ. కేటీఆర్..చేసిన హడావుడికి…రేవంత్ కొనసాగింపునిచ్చారు. కేసీఆర్…అసెంబ్లీకి వస్తే ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాది అంటూనే… అవసరమైతే… ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ వస్తా అంటూ మరోసారి బీఆర్‌ఎస్‌ని ఉచ్చులోకి లాగారాయన. చర్చ మొదలుపెట్టింది, మళ్ళీ బాల్‌ని ప్రతిపక్షం కోర్టులోకి నెట్టింది కూడా ముఖ్యమంత్రే. కానీ… ఫామ్‌హౌస్‌లో చర్చ విషయమై… ప్రతిపక్షం నుంచి కౌంటర్ ధీటుగా రాలేదు. మొదట రేవంత్ వచ్చి మా వలలో పడ్డారని అనుకుంది ప్రతిపక్షం. కానీ వరుస కౌంటర్స్‌తో…నేనే ఫామ్‌హౌస్‌కి వస్తాననడం ద్వారా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదన్న చర్చను ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారన్న అభిప్రాయం ఉంది. ఏదేమైనా…. సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో వారం రోజుల నుంచి తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మాత్రం హీటెక్కిపోయింది.
