Hyderabad : హైదరాబాద్…పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. సాఫ్ట్‌వేర్‌లో దూసుకుపోతున్న భాగ్యనగరం…ఫోర్త్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచస్థాయిలో వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఫ్యూచర్ సిటీ పూర్తయితే…భవిష్యత్‌లో ఏ వ్యాపారానికైనా హైదరాబాద్ పొటెన్సియల్‌గా మారనుంది. ఫార్మా, సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర రంగాల ఇన్వెస్టర్లు కంపెనీలు పెట్టే అవకాశం ఏర్పడనుంది. పదేళ్ల తర్వాత హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోనుంది.
దేశంలోనే అన్ని రంగాల్లోకెల్లా…హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. జీవన ప్రమాణాల్లోనూ ప్రగతి సాధిస్తోంది. హైదరాబాదీ అని చెప్పుకోటానికి చాలా మంది గర్వపడతారు. ఇక్కడ బతికి మరో చోటికి వెళ్లటానికి చాలా మంది ఇబ్బంది పడతారు. ఈ నగరానికున్న ప్రత్యేకత అదే. దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్‌ను మరో మెట్టు ఎక్కించేలా…రేవంత్‌రెడ్డి సర్కార్ ఫోర్త్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది.
వందల ఏళ్ల పురాతన చరిత్ర.. భిన్న సంస్కృతుల కలయిక.. అత్యాధునికతను అంది పుచ్చుకోవటంలో జెట్ స్పీడు.. గరీబు నుండి అమీర్ వరకు గౌరవంగా బతికే అవకాశం.. భద్రమైన భౌగోళిక పరిస్థితులు.. ఇవన్నీ హైదరాబాద్ కు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు. నదుల ఒడ్డున నాగరికతలు విలసిల్లాయని చరిత్ర చెబుతుంది. మూసీ ఒడ్డున పుట్టిన హైదరాబాద్.. దాన్ని దాటుకుని నవనాగరిక ప్రపంచంలో యవ్వనోత్సాహంతో పరుగులు పెడుతోంది. ప్రపంచంలో ప్రఖ్యాత నగరాలను పరిశీలిస్తే…ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. గతం నుంచి వర్తమానం వరకు…అంతర్లీనంగా ప్రవహించే ఓ జీవలక్షణం కనిపిస్తుంది. అది అనేక సంక్షోభాలను దాటి అభివృద్ధి పథంలో పయనిస్తోంది. కాలగమనంలో అనేక మార్పులకు లోనైన విధానాన్ని చాటుతుంది. నాలుగు శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్న హైదారాబాద్…అభివృద్ధిలో వడివడిగా అడుగులు వేస్తోంది. ఓ ఇరవై ముప్పైఏళ్లు వెనక్కు వెళితే.. నాటి నగరానికి నేటి సిటీకి ఎంతో తేడా కనిపిస్తుంది. దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఘనతను హైదరాబాద్ సొంతం చేసుకుంది.
దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోల్చితే ఐటీలో హైదరాబాద్ అగ్రగామిగా ఉంది. అమెజాన్, గూగుల్, ఫేస్ బుక్ సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి. స్టార్టప్ హబ్ గా కూడా నగరం ఎదుగుతోంది. దీనికి కారణం నగరంలో ఉన్న భద్రమైన, సౌకర్యవంతమైన పరిస్థితులే. 16 వ శతాబ్దంలో 3.5 చదరపు కిలోమీటర్లు ఉన్న నగర విస్తీర్ణం ఇప్పుడు 7228 చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి విస్తరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 70 లక్షల 70,000 ఉన్న నగర జనాభా నేడు కోటి 20 లక్షలు దాటింది. ఇది 2030 నాటికి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన 28 మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తుందని అంచనా.
హైదరాబాద్ అనుకూలతల్ని గుర్తించే.. ఇతర నగరాల్లో ఉన్న పెట్టుబడులు కూడా ఇక్కడికి తరలివస్తున్నాయి. పెట్టుబడిదారులకు హైదరాబాద్ లక్కీ మస్కట్ గా మారిందని చెప్పవచ్చు. కొంత మంది తమ కొత్త వ్యాపారాలు హైదరాబాద్ నుంచే మొదలుపెడుతున్నారు. మరికొందరు హైదరాబాద్ వేదికగా వ్యాపార విస్తరణ చేస్తున్నారు. ఇంకొందరు తమ ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదో రూపంలో తమ బిజినెస్ కు హైదరాబాద్ లింక్ ఉండాలని కంపెనీలు కూడా తాపత్రయపడుతున్నాయి. రవాణా సౌకర్యాలు, జీవన పరిస్థితులు, సామాజిక స్థితిగతులు, మానవవనరులు.. ఇలా ఏ అంశం చూసుకున్నా.. హైదరాబాద్ ది బెస్ట్ అనిపించుకుంటోంది. హైదరాబాద్ కు మించిన మెరుగైన గమ్యస్థానం లేదనే పేరు రావటానికి ఇదే ప్రధాన కారణం.
దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరుతో పోటీ పడుతూ హైదరాబాద్ దూసుకెళ్తోంది. నగరంలో ఉన్న అనుకూల పరిస్థితులతోనే దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు భారీ పెట్టుబడులతో వస్తూ లక్షల మందికి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన 20కి పైగా ఎంఎన్‌సీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఎక్కడో ఓ చోట కొత్త కంపెనీల కార్యాలయాల ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో భౌగోళికంగా అత్యంత అనుకూలమైన, అనువైన ప్రాంతంగా హైదరాబాద్‌కు గుర్తింపు ఉంది.
ప్రభుత్వాలు మారినా.. హైదరాబాద్ లో మౌలిక వసతులకు కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. నిరంతర నాణ్యమైన విద్యుత్తు, 50 ఏళ్లకు సరిపడా మంచినీటికి కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటి తరలించేందుకు పైప్‌లైన్ నెట్‌వర్క్, రిజర్వాయర్లు, ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మించాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేశాయి. హైదరాబాద్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు వేరే రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ కాస్త చౌక. హైదరాబాద్‌లో సగటున 10వేల రూపాయలతో నెలగడుపుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాతో పోల్చితే తాగునీటి సమస్య అతి తక్కువగా ఉన్న నగరం హైదరాబాద్. ఇంత అనుకూల వాతావరణం మరే నగరంలోనూ లేదు. మరో 25 ఏళ్ల వరకు హైదరాబాద్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఢిల్లీలో విపరీతమైన ఎండ, చలి ఉంటుంది. ముంబైలో విపరీతమైన కాలుష్యం సమస్యగా ఉంది. బెంగళూరు చిన్న నగరం కానీ జనాభా ఎక్కువ. భయంకరమైన ట్రాఫిక్ సమస్య ఉంది. చెన్నైలో విపరీతమైన హ్యుమిడిటీ ఉంటుంది. కోల్‌కతా.. అత్యంత మురికి నగరాల్లో ఒకటి. కానీ హైదరాబాద్ కు చెప్పుకోదగ్గ సమస్యలేవీ లేవు. ఇలా ఏ రకంగా చూసినా హైదరాబాద్ మిగిలిన అన్ని మెట్రో నగరాలకంటే చాలా బెటర్.
ఏ నగరమైనా విస్తరించాలంటే కావాలసినంత భూమి లభ్యత ఉండాలి. హైదరాబాద్‌కు నలువైపులా విస్తరణకు అవకాశం ఉంది. ఇటు విజయవాడవైపు, అటు మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఇలా నలువైపులా నగరం పెరగడానికి అవకాశం ఉంది. 8 లక్షల ఎకరాలకు పైగా నివాసయోగ్యమైన భూమి ఉంది. నగర విస్తరణకు విపరీతమైన అవకాశాలున్నాయి. ORR వేసిన తర్వాత హైదరాబాద్ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. ORR చుట్టూ మరో కొత్తనగరం ఏర్పడుతోంది. ముందుచూపుతో 40కిలోమీటర్ల దూరంలోనే ప్రపంచంలోనే అత్యాధునిక సౌకర్యాలున్న ఎయిర్‌పోర్ట్ నిర్మించడంతో అసలు హైదరాబాద్‌కు తిరుగులేకుండా పోయింది. ఈ రోజు దేశంలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఎయిర్‌పోర్టే అధునాతనమైనది. జీవన ప్రమాణాల విషయంలో మరే నగరమూ హైదరాబాద్‌కు సరితూగదు. అద్దెలు కూడా మిగిలిన నగరాలతో పోల్చితే చాలా తక్కువ.
హైదరాబాద్ లో ఎన్నో మార్పులు శరవేగంగా జరిగాయి. ఐటీ, ఫార్మా ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ ను .. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా చేయడానికి ప్లాన్లు రెడీ అయ్యాయి. అది కూడా సాకారమైతే.. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అనే ట్యాగ్ లైన్ ను పదిలం చేసుకునే అవకాశాలున్నాయి. ఓ పక్క ఘనమైన చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే.. అంతర్జాతీయ స్థాయి హంగులు కూడా అందిపుచ్చుకుంటోంది హైదరాబాద్. ఈ అనుకూలతలే హైదరాబాద్ ను పెట్టుబడుల పరంగా తిరుగులేని స్థాయిలో నిలబెడుతున్నాయి. మన దేశంలో పెట్టుబడులు పెట్టాలనకునేవారంతా.. మొదట హైదరాబాద్ వైపు చూసేలా భాగ్యనగరం అందర్నీ సూదంటురాయిలా ఆకర్షిస్తోంది.
హైదరాబాద్…ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. బెంగళూరు, కోల్‌కత్తా, ముంబైతో పోల్చితే…ఏ రకంగా తీసుకున్నా భాగ్యనగరం బెస్ట్. వాతావరణమైనా…కాస్ట్ ఆఫ్ లివింగ్…ఎలా ఏది పోల్చుకున్నా…హైదరాబాద్ టాప్‌లో ఉంటుంది.
అంతర్జాతీయ నగరాలకు దీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం…దేశానికి ఫ్యూచర్ సిటీని అందిస్తోందని అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ, తమిళనాడు, కేరళ పోటీ పడుతున్నాయని చెప్పారు. రానున్న వందేళ్లను దృష్టిలో పెట్టుకొని విజన్-2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. పెట్టుబడిదారులకు రక్షణ కల్పించి…వారి వ్యాపారం లాభాల్లో సాగేలా సహకరిస్తున్నట్లు తెలిపారు.
ఫ్యూచర్ సిటీలో అన్ని వనరులు, సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. అన్నివర్గాల వారు ఇక్కడ జీవించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే మలక్‌పేటలో 150 ఎకరాల్లో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్‌ను ఇక్కడకు తరలించే ఏర్పాట్లు మొదలు పెట్టింది. ప్రపంచ స్థాయి గోల్ఫ్ క్లబ్ నిర్మించేందుకు 250 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. పలు అంతర్జాతీయ సంస్థలు…తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వ్యాపారవేత్తల అభిరుచులకు అనుగుణంగా బిలియనీర్ల క్లబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. బీసీసీఐ కూడా ఇక్కడ అతిపెద్ద స్టేడియం నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఇక్కడ కంపెనీలు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. వేల ఎకరాల్లోని పార్కులు, రోడ్లకు ఇరువైపులా ఉండే మొక్కల కోసం మూసీ నీటిని శుద్ధి చేసి వినియోగించాలని నిర్ణయించారు. మూసీ నీటిని తరలించేందుకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పక్క నుంచే ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారు.
ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగితే…వచ్చే 10 ఏళ్లలో ముఖ చిత్రమే మారిపోతుంది. రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మందగమనంలో ఉన్నప్పటికీ…దాంతో సంబంధం లేకుండా హైదరాబాద్ అభివృద్ది అవుతోంది. కేవలం రియల్ ఎస్టేట్‌పై మాత్రమే ఆధారపడి ఈ సిటీ ఎదగట్లేదు. ఢిల్లీ నుంచి ఇటీవల 8 వేల కుటుంబాలు హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోయాయి. అక్కడ కాలుష్యం, అధిక జానాభా తట్టుకోలేక హైదరాబాద్‌లో సెటిల్ అవుతున్నారు. దేశంలో ఎక్కువ కొత్త వాహనాలతో పాటు లగ్జరీ కార్లను హైదరాబాదీలు కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ ఎదుగుదలకు తిరుగులేదని చెప్పడానికి ఇవే నిదర్శనం.
మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ అగ్రగామిగా ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్, వాతావరణం, వరల్డ్‌లోనే టాప్ క్లాస్ ఆస్పత్రులు, ప్రపంచంలోనే అగ్రగామి కంపెనీలు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భాగ్యనగరం సొంతం. దీనికి తోడు గ్రేడ్ వన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రతి రోజు 90వేల మంది ప్రయాణికులు వివిధ దేశాలకు వెళ్తున్నారు. రోజుకు 450 ఫ్లైట్స్ ఇక్కడి వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా వంటి నగరాలతో పోల్చితే…ఇక్కడ ఇళ్ల అద్దెలు చాలా తక్కువ. ఇంత పొటెన్షియల్ ఉన్న సిటీ మనదేశంలో హైదరాబాద్ తప్ప మరొక్కటి లేదు. బెంగళూరు, ముంబైతో పోలిస్తే..తక్కువ ధరలకే అపార్ట్‌మెంట్‌లు దొరుకుతున్నాయి. హైదరాబాద్‌లో వివిధ దేశాలకు చెందిన ఫుడ్ లభిస్తుంది. అమెరికా, ఆఫ్రికన్, యురప్ దేశాల ఆహరం అందుబాటులో ఉంది. గల్ఫ్ దేశాలతో పాటు ఆసియా దేశాల నుంచి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఆస్పత్రులకు వస్తున్నారు.
ఫోర్ట్ సిటీ పూర్తయినా…హైదరాబాద్‌లో ఇంకా 8 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంటుంది. ఫ్యూచర్‌లో ఏ వ్యాపారానికైనా హైదరాబాద్ పొటెన్సియల్‌గా మారనుంది. ఫార్మా, సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర రంగాల ఇన్వెష్టర్లు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు…హైదరాబాద్‌కు మణిహారం లాంటింది. సిటీలో ఏటా 25 బ్రాండెండ్ బంగారం షాపులు ఏర్పాటువుతున్నాయి. అంటే జనంలో కొనుగోలు శక్తి ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తయితే…పదేళ్ల తర్వాత హైదరాబాద్‌ను…అమెరికాలోని న్యూయార్క్ సిటీతో పోల్చుకోవచ్చు. గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతోంది. అనేక ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో గణనీయమైన వృద్ధి సాధిస్తోంది.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. ఐటీ, బ్యాంకింగ్, సేవారంగాలతోపాటు ఫైనాన్స్ రంగంలో పటిష్ఠమైన సేవలకు హైదరాబాద్ చిరునామాగా మారింది. హైదరాబాద్ ఆర్థికాభివృద్ధి ఇలాగే కొనసాగితే రానున్న పదేళ్లలో అంటే 2035 నాటికి తలసరి జీడీపీ వృద్ధిరేటులో ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉండే అవకాశం ఉంది. ప్రముఖ గ్లోబల్ ప్రాపర్టీ అడ్వైజర్ అయిన సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాల్లో హైదరాబాద్ 5వ స్థానంలో నిలిచింది. గ్రోత్ హబ్స్ ఇండెక్స్ 2034 నాటికి GDP పెరుగుదల, వ్యక్తిగత సంపద, జనాభా పోకడలు, వలసల నమూనాలు వంటి కీలక అంశాలను విశ్లేషించి ర్యాంకింగ్ ఇచ్చారు.
ఇండియాలో వేగవంతమైన పట్టణీకరణతో, హైదరాబాద్ ఇతర ప్రధాన భారతీయులతో పాటు ప్రముఖంగా ఉండటంలో ఆశ్చర్యం లేదని పలువురు చెబుతున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాల జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో వియత్నాంలోని హోచిమిన్ సిటీ ఉండగా.. మూడో స్థానంలో ఢిల్లీ నిలిచింది. 4వ స్థానంలో చైనాలోని షెన్‌జెన్ ఉంది. హైదరాబాద్ 5వ స్థానంలో నిలిచింది. వియత్నాంలోని హెనోయి ఆరో స్థానం దక్కించుకుంది. ఏడో స్థానంలో చైనాలోని గ్వాంగ్‌జౌ ఉంది. 8వ స్థానంలో ముంబై ఉండగా.. 9వ స్థానంలో ఫిలిప్పీన్స్ లోని మనీలా ఉండగా.. 10వ స్థానంలో సౌదీ అరేబియా రాజధాని రియాద్ ఉంది.
