Site icon NTV Telugu

Balmoori Venkat: సిద్దిపేటలో బల్మూరి వెంకట్ అరెస్ట్

Nsui State President Balmoori Venkat

Nsui State President Balmoori Venkat

సిద్దిపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నకోడూరు మండలం రామునిపట్ల వద్ద వెంకట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఆదివారం సిద్దిపేట జిల్లా బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం బహిర్గతం కావద్దనే ఉద్దేశంతో పాఠశాలలోనే ప్రథమ చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో సోమవారం వారిని సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆ విద్యార్థులను కలిసి వారిని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు హుజూరాబాద్ నుంచి సిద్దిపేటకు బయలుదేరిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను సిద్దిపేట జిల్లా రామునిపట్ల వద్ద పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. బల్మూరి వెంకట్ వాహనాన్ని అడ్డుకున్న క్రమంలో స్థానిక ఎన్ఎస్‌యూఐ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలీసులను నిలువరించే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా వాతావరణం రణరంగంగా మారింది. తాను కేవలం వారి ఆరోగ్య పరిస్థితిని మాత్రమే తెలుసుకునే ఉద్దేశంతో పోతున్నామని వెంకట్ బల్మూరి పోలీసులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన వినని పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని చిన్నకోడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టుకు నిరసనగా సిద్దిపేట మైనారిటీ గురుకుల పాఠశాల ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు.

Exit mobile version