సీఎం రేవంత్ రెడ్డికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని.. గత సంవత్సరం ఆగష్టు సెప్టెంబర్ నెలలో సమ్మెకు దిగారు. అప్పటి టీపీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న తమరు వారికి సంఘీభావం తెలిపి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నా వారి సమస్యలను అటకెక్కించారని లేఖలో ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు అలవికాని ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తున్నారు. ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చక పోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఏ ఒక్క హామీని సరిగా నెరవేర్చకపోగా ప్రజా పాలన విజయోత్సవాల పేరిట, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మహేశ్వర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
విద్యాశాఖలో పని చేస్తున్న SSA సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లు:
1. సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలి.
2. అప్పటివరకు తక్షణమే ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్ ఇవ్వాలి.
3. ప్రతీ ఉద్యోగికి జీవిత భీమా 10 లక్షలు , ఆరోగ్య భీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలి.
4. SSA ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్న వారికి మరియు చేసిన వారికి బెనిఫిట్స్ కింద రూ.25 లక్షలు ఇవ్వాలి.
5. ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాలలో వెయిటేజ్ కల్పించాలి.
6. సమగ్రశిక్ష ఉద్యోగులందరికీ రీ ఎంగేజ్ విధానాన్ని తీసివేయాలి.
సమగ్ర శిక్షా ఉద్యోగుల పై నాణ్యమైన డిమాండ్లను తక్షణమే అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. లేని ఎడల భారతీయ జనతా పార్టీ శాసన సభ పక్ష తరపున సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షకు మద్దతుగా నిలబడి రాబోవు రోజుల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.