NTV Telugu Site icon

Niranjan Reddy: మేకిన్ ఇండియా అంటూ.. సేల్ ఇండియా చేపట్టారు

Niranjan Reddy Fire On Modi

Niranjan Reddy Fire On Modi

హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల మీద మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మరోసారి తెలంగాణపై విషం చిమ్మారని, ఆయన చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. తల్లిని చంపి పిల్లని బతికించారన్న మోదీకి.. తెలంగాణ అమరవీరుల గురించి అర్హత లేదని, అసలు తెలంగాణలో బీజేపీకి స్థానమే లేదని అన్నారు.

అభివృద్ధి పేరుతో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దేశాన్ని అమ్ముతుంటే.. ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు కొనుక్కుంటున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. మేకిన్ ఇండియా అని చెప్తూ.. సేల్ ఇండియా చేపట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ రూ. 100 లక్షల కోట్ల అప్పు చేశారని.. ఆగస్టు వరకు మరో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. రూ. 11 లక్షల కోట్ల కార్పొరేట్ అప్పులను మోదీ మాఫీ చేయించారని, రూ. 4 వేల కోట్లు పెట్టి తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనమంటే మొహం చాటేస్తున్నారని నిరంజన్ విమర్శించారు.

కేంద్రంలో 15 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, వాటిని నింపడానికి మోదీకి చేత కావడం లేదని దుయ్యబట్టారు. అలాంటి మోదీ యువత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అంధ భక్తులను తయారు చేసి పబ్బం గడుపుకుంటున్నారని.. వాట్సాప్‌లో తప్పుడు ప్రచారాలు చేస్తూ, వివిధ రాష్ట్రాల్లో హింసను రెచ్చగొడుతున్నారని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.