NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!

Nims

Nims

NIMS : హైదరాబాద్‌లోని నైజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. కేవలం రెండున్నర సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే 1,000 రొబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలసి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ రంగంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న నిమ్స్ వైద్యులను, నర్సింగ్ అధికారులను, సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఉచితంగా 90 శాతానికి పైగా శస్త్రచికిత్సలు

నిమ్స్‌లో ఇప్పటివరకు నిర్వహించిన వెయ్యి రొబోటిక్ సర్జరీలలో యూరాలజీ విభాగంలో 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీలో 248, సర్జికల్ ఆంకాలజీ విభాగంలో 162 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. అత్యంత ఖరీదైన ఈ రొబోటిక్ శస్త్రచికిత్సలలో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పథకాల ద్వారా పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందించడం విశేషం.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక రొబోటిక్ సేవలు

దక్షిణ భారతదేశ ప్రభుత్వ రంగంలో తొలి రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నిర్వహించిన ఘనత నిమ్స్‌దేనని మంత్రి దామోదర్ రాజనర్సింహ గుర్తుచేశారు. ఇటీవలే 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసిన నిమ్స్, ఇప్పుడు 1,000 రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరడం ప్రభుత్వ వైద్య సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం నిమ్స్‌తో పాటు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని, రాబోయే రోజుల్లో గాంధీ, కొత్త ఉస్మానియా, నిర్మాణం పూర్తికావస్తున్న టిమ్స్ (TIMS) ఆస్పత్రుల్లోనూ అత్యాధునిక రొబోటిక్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

నిమ్స్ వైద్య బృందానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలను పేదలకు అందించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలోనే 1,000 రొబోటిక్ ఆపరేషన్లు పూర్తి చేసిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, వైద్యుల బృందం, ఆపరేషన్ థియేటర్, నర్సింగ్ సిబ్బందికి సీఎం తన అభినందనలు తెలిపారు. వివిధ వైద్య విభాగాలు, అనస్థీషియా, నర్సింగ్ టీమ్స్ సమిష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని నిమ్స్ డైరెక్టర్ పేర్కొన్నారు. వైద్యరంగానికి పూర్తి సహకారాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.