NIMS : నిమ్స్‌లో ఏసీబీ షాకింగ్ తనిఖీలు.. చనిపోయిన రోగుల పేరుతోనూ బిల్లులు!

Nims

Nims

నగరంలోని పంజాగుట్టలో ఉన్న నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ ఏసీబీతో పాటు టీజీ సేఫ్ (ఫుడ్ సేఫ్టీ), డ్రగ్ కంట్రోల్ విభాగం మరియు కార్మిక శాఖల ప్రత్యేక బృందాలు సంయుక్తంగా గత అక్టోబర్ 29 మరియు నవంబర్ 2 తేదీలలో ఈ సోదాలు జరిపాయి. ఈ తనిఖీల్లో ఆసుపత్రి నిర్వహణ, టెండర్లు మరియు బిల్లింగ్‌లలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు ఏసీబీ సోమవారం (23.11.2026) విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది.

తనిఖీల్లో వెలుగుచూసిన ప్రధాన అక్రమాలు:

ఆపరేషన్ థియేటర్లలో రూ. 5 కోట్ల అక్రమ నిల్వలు: ఐదు ఆపరేషన్ థియేటర్లను (OT) తనిఖీ చేయగా, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి లేకుండా ప్రైవేట్ వెండర్లు సుమారు రూ. 5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, ఇతర సామగ్రిని ఓటీల సమీపంలోని అల్మారాలు, సబ్-స్టోర్లలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మెయిన్ స్టోర్‌కు ఇండెంట్ పెట్టకుండానే నేరుగా వెండర్ల నుంచి ఇంప్లాంట్లను తీసుకుని వాడుతున్నారు. అనంతరం యూటిలిటీ సర్టిఫికెట్ జారీ చేసి వెండర్ ఇన్వాయిస్‌తో కలిపి మెయిన్ స్టోర్‌కు పంపుతూ బిల్లులు మంజూరు చేయిస్తున్నారు. ఇది సరఫరాదారులతో కుమ్మక్కై, వాడని ఇంప్లాంట్లకు కూడా బిల్లులు చేసుకునేందుకు ఆస్కారం కల్పిస్తోందని ఏసీబీ పేర్కొంది.

మరణించిన మూడు నెలల తర్వాత కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు: రోగులు డిశ్చార్జ్ అయిన తర్వాత, ముఖ్యంగా ప్రభుత్వం చెల్లింపులు చేసే ‘ఆరోగ్యశ్రీ’ పథకం కింద చేరిన రోగుల పేరుతో బిల్లులు ప్రాసెస్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో రోగి మరణించిన మూడు నెలల తర్వాత కూడా బిల్లులు చేసినట్లు తేలింది. కేవలం జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే రోగులు డిశ్చార్జ్ అయిన తర్వాత సుమారు రూ. 66 లక్షల విలువైన బిల్లింగ్ ఎంట్రీలు నమోదు చేశారు.

సర్జికల్ వస్తువుల వినియోగంలో అక్రమాలు: సర్జికల్ వస్తువులను అసాధారణ రీతిలో వినియోగించినట్లు రికార్డులు చూపుతున్నాయి. ఉదాహరణకు, ఒకే రోగికి వారం రోజుల్లో 800 గ్లౌజులు వాడినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఈ అవకతవకలన్నీ ఎక్కువగా ఆరోగ్యశ్రీ రోగుల ఖాతాల్లోనే జరిగాయి.

మ్యాన్‌పవర్ సేవలు: 2019–2025 మధ్య కాలంలో మ్యాన్‌పవర్ సేవలకు సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తి చేయలేదు. కార్మికుల నియామకాల్లో, వారిని సెమీ-స్కిల్డ్ కేటగిరీకి మార్చడంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, నియామకాల్లో కుమ్మక్కైనట్లు ఆధారాలు లభించాయని అధికారులు తెలిపారు.

ప్రధాన క్యాంటీన్ దుస్థితి: ఆసుపత్రిలోని మెయిన్ క్యాంటీన్ అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తోంది. అక్కడ గడువు తీరిన ఆహార పదార్థాలను గుర్తించడంతో పాటు, క్యాంటీన్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) రిజిస్ట్రేషన్ లేదని తేలింది. కార్మిక చట్టాల ఉల్లంఘనలతో పాటు, క్యాంటీన్ టెండర్ ప్రక్రియలో బిడ్డర్లు కుమ్మక్కై పోటీని అడ్డుకున్నట్లు ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది.

మెడికల్ షాపులు & సెక్యూరిటీ సేవలు: ఆసుపత్రిలోని మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా నిర్వహించాల్సిన విక్రయ రికార్డులు లేవని, రిజిస్టర్ కాని కార్మికులను పనిలో పెట్టుకున్నారని గుర్తించారు. సెక్యూరిటీ సేవల టెండర్ల ఖరారులో తీవ్ర జాప్యం చేస్తూ పాత కాంట్రాక్టులనే పదేపదే పొడిగించారు. అంతేకాకుండా, నిబంధనలు ఉల్లంఘించిన ఒక ఏజెన్సీకి చెందిన రూ. 28.13 లక్షల బ్యాంక్ గ్యారెంటీని కూడా జప్తు చేయలేదు.

ఈ ఆరోపణలపై తదుపరి విచారణ మరియు నిర్ధారణ కోసం తనిఖీల్లో భాగంగా నోట్ ఫైళ్లు, ఒప్పంద పత్రాలు మరియు ఇతర సంబంధిత రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.