రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంపై నిర్లక్ష్యం వహించిన వారిపై వికారాబాద్ కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. నలుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయడమే కాకుండా మండల పంచాయతీ అధికారిపై బదిలీ చేశారు ఆమె. పల్లెప్రగతి పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సంబంధిత అధికారులను హెచ్చరించారు. పల్లె ప్రగతి పనుల్లో ప్రభుత్వం నిర్దేశించిన అంశాల్లో నిర్లక్ష్యం వహించిన పూడూరు మండలం, చింతల్‌పల్లి పంచాయతీ కార్యదర్శి హమీద్, గొంగుపల్లి పంచాయతీ కార్యదర్శి శృతిలతో పాటు పరిగి మండలం, మాదారం పంచాయతీ కార్యదర్శి పి.వరలక్ష్మి, వికారాబాద్ మండలం, మదన్‌పల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిలను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
అంతే కాకుండా పూడూరు ఎంపీవో కరీంను కులకచర్ల మండలానికి బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న ఎంపీవో సురేందర్‌ను పూడూరుకు బదిలీ చేశారు. డీపీఆర్‌సీలో పల్లె ప్రగతి కార్యక్రమంపై మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పల్లె ప్రగతి పనులు పరిశీలించేందుకు శనివారం వచ్చిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్ డాక్టర్ శరత్ పర్యటనలో వెలుగు చూసిన అంశాలపై సమీక్షించారు. పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
గ్రామాల్లో మురుగు కాలువలు రోజూ శుభ్రం చేయాలని, రోడ్లు, వీధులపై చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామానికి వెళ్లే రోడ్లకు ఇరువైపులా గుంతలు తీసి మొక్కలు నాటాలని, వైకుంఠధామాలకు కరెంట్, నీటి సరఫరా కల్పించాలని తెలిపారు. పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు ఎండిపోకుండా దట్టమైన అడవిని తలపించేలా పచ్చదనం పెంపొందించాలని సూచించారు. ఇళ్లలో నుంచి సేకరించిన తడి చెత్తను ఎరువుగా మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రోడ్లపై మురుగు నీరు ప్రవహించకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె స్పష్టం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయనేది తెలుసుకునేందుకు నిఘా బృందాలతో తనిఖీ చేయిస్తామని ఆమె తెలిపారు. గ్రామాల్లో ఎక్కడ కూడా అపరిశుభ్రత కనిపించకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని కలెక్టర్ నిఖిల హెచ్చరించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో జానకిరెడ్డి, ఇన్‌చార్జి డీఆర్‌వో విజయకుమారి, డీఆర్‌డీవో కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Summer Season: సుర్రుమంటున్న సూరీడు .. జంకుతున్న జనాలు