తెలంగాణ వ్యాప్తంగా జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన సంచలంన కలిగించింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులకు చెందిన పిల్లలుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ ఘటన రాజకీయంగా కూడా చర్చనీయాంశం అయింది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నాయి. రాజకీయ ప్రోద్భలం ఉండటంతోనే అధికారులు చర్యలు ఆలస్యం అవుతున్నట్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బాధితురాలి ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడంతో ఈ అంశం మరో టర్న్ తీసుకుంది. బాధితురాలి గుర్తింపును బహిరంగ పరిచారంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే రఘునందన్ రావును టార్గెట్ చేశాయి. ఆయన ఇంటిని ముట్టడించాయి. ఇప్పటికే రఘునందర్ రావుపై కేసు నమోదు అయింది.
ఇదిలా ఉంటే జూబ్లిహిల్స్ అత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. రాజకీయ వ్యక్తులకు చెందిన పిల్లలు కారులో బాలికపై అత్యాచారం చేసిన ఘటన తమ దృష్టికి వచ్చిందని.. మరో అత్యాచార ఘటన కూడా ఈ రోజు తమ దృష్టికి వచ్చిందని మేము వీటిని పరిగణలోకి తీసుకుంటున్నామని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ వెల్లడించారు. బాలికలు, మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై, ఇటీవల జరిగిన అత్యాచార ఘటనపై నేరుగా జోక్యం చేసుకుని 7 రోజుల్లో నివేదిక పంపాలని తెలంగాణ డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.
