ఆగస్టు 15, జనవరి 26వ తేదీ వచ్చిందంటే చాలు మనలో చాలామందికి దేశభక్తి పొంగిపొరలుతుంది. సోషల్ మీడియాలో దేశభక్తి వెల్లువలా మెసేజ్ లు, స్టాటస్ ల రూపంలో కనిపిస్తుంది. కానీ నిత్యం తమలోని దేశభక్తిని చాటుకుంటూ తమ విలక్షణతను అందరికీ తెలియచేస్తున్నారు కొందరు దేశభక్తులు.
ఇలాంటి అరుదైన ఘటన నిత్యం ఒక జిల్లాలో కనిపిస్తుంది. అది కూడా తెలంగాణలోనే వుండడం గమనార్హం. తెలంగాణకు మకుటాయమానంగా మారిన ఆ జిల్లా వేరే ఏదీ కాదు. పోరాటాల ఖిల్లా.. నల్లగొండ జిల్లా. అక్కడ ఉదయం 8.30 అయిందంటే చాలు అందరి చేతులు భరతమాతకు సెల్యూట్ చేస్తుంటాయి. నల్లగొండ టౌన్ లోని 12 ప్రధాన జంక్షన్లలో ఉదయం జనగణమన వినిపిస్తుంది. ఏ పనిచేసేవారైనా 52 సెకండ్ల పాటు నిలబడి పోతారు. దేశభక్తిని చాటుకుంటారు. పౌరులంతా జాతి, మత, కులం, వర్గం తేడా లేకుండా జనగణమన పాడతారు. ఈ ఏడాది జనవరి 23 నుంచి ఈ సంప్రదాయం అక్కడ ప్రారంభమయింది. ఈ సంప్రదాయాన్ని జనగణమన ఉత్సవ సమితి ప్రెసిడెంట్ కర్నాటి విజయ్ కుమార్ ప్రారంభించారు. ఆయనకు అనేకమంది మిత్రులు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు.
ప్రతి రోజూ జనగణమన ఆలపిస్తున్న వీరిని పలువురు అభినందిస్తున్నారు. ఇలా జనగణమన పాడడం దేశభక్తికి నిదర్శనం అనీ కర్నాటి విజయ్ కుమార్ అంటున్నారు. ఈ పద్ధతిని నల్లగొండలోని ఇతర పట్టణాల్లోనూ అనుసరిస్తున్నారు. 2020లో గాల్వాన్ వ్యాలీలో చైనాతో జరిగిన ఘర్షణల్లో నేలకొరిగిన అర జవాన్, భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు జన్మించిన ప్రాంతం కూడా నల్లగొండ కావడం విశేషం.