Nallu Indrasena Reddy Allegations On TRS Government: అన్ని స్కామ్‌లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్వాల్వ్‌మెంట్ ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కోర్టులో ఉన్న కేసు (ఎమ్మెల్యేల ఎర కేసు) గురించి తామేమీ మాట్లాడలేమని, అంతా వాళ్లే చూసుకుంటారని అన్నారు. తమ గురించి మాట్లాడొద్దని వాళ్లే కోర్టుకి వెళ్లారని, ఈరోజు వాళ్లే మాట్లాడుతున్నారని అన్నారు. బడ్జెట్ పాస్ చేసి ముందస్తుకు వెళ్లినా సరే.. తెలంగాణలో వచ్చేది బీజేపీ అధికారమేనని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో కాంప్రమైజ్ పాలిటిక్స్ ఉండేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ఇంద్రసేనా రెడ్డి అన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు.. అక్రమాలను అరికట్టలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు ప్రధాని మోడీ దర్యాప్తు సంస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని, అందుకే కేసుల సంఖ్య అధికంగా నమోదు అవుతున్నాయని చెప్పారు. ఈ కేసులపై రాజకీయంగా ఆరోపణలు చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సమయం వచ్చినప్పుడు.. కేసీఆర్‌కు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారన్నారు. కేసిఆర్ కుటుంబంలో సమస్య వచ్చినా.. బీజేపీపై తోయడం కామన్ అయిపోయిందన్నారు.
మునుగోడు ఎన్నికల తర్వాత కేసిఆర్‌కు భయం పట్టుకుందని ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని కేసిఆర్ రాత్రి పగలు ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల నుంచి బీజేపీ బలం పెరుగుతోందన్నారు. అందుకే బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవాలని కేసిఆర్ చూశారన్నారు. కేసీఆర్ అడుగడగునా పాదయాత్రకు అడ్డం పడుతున్నా.. ప్రజలు మాత్రం బండి పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడించారు.
