నల్గొండ పట్టణంలో లాక్‌డౌన్ పేరుతో ఈ రోజు ఉదయం పోలీసులు అత్యుత్సాహం లాఠీఛార్జీ చేయడాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. లాక్‌డౌన్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే ఉ. 09.40 గం.లకే సామాన్య ప్రజలపై విరుచుకుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలతో పాటు తమ ప్రాణాలకు తెగించి కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందజేస్తున్న విద్యుత్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, మీడియా ప్రతినిధులపై సైతం లాఠీలతో దాడులకు పాల్పడడంపై మండిపడ్డారు. ఇలా పోలీసులు ఓవరాక్షన్ చేస్తే కరోనా కాలాన ఎవరు కూడా అత్యవసర సేవలు అందించడానికి ముందుకు వచ్చేందుకు ఆలోచిస్తారని స్పష్టం చేశారు.
ఎవరైనా ఉ. 10 గంటల తరువాత ప్రజలు రోడ్లపై తిరిగితే వారి వాహానాలు సీజ్ చేస్తామని చెనిలప్పిన పోలీసులు అత్యుత్సహానికి పోయి తీవ్రస్థాయిలో లాఠీ ఛార్జీ చేయడం ఏమిటనీ ప్రశ్నించారు. ఏ పోలీసు అధికారి సిబ్బందికి ప్రజలను కొట్టే అధికారం ఎక్కడిదని నిలదీశారు. మళ్లీ ఇలాంటి చర్యలకు పూనుకుని ఎవరిపైనా లాఠీ ఛార్జీ చేసిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అసలు ఉ. 10 గం.లు కాక ముందే ఎలా వాహానాలను ఆపుతారని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ ప్రాణాలపై ఆశ ఉందని కరోనా పట్ల అవగాహన ఉందని తెలిపారు. 5, 10 నిమిషాలు ఆలస్యమైన విడిచిపెట్టాలి కానీ 10 నిమిషాల ముందే ప్రజలు, సర్కార్ మినహాయింపు ఇచ్చిన సిబ్బంది, ఉద్యోగులపై లాఠీ ఛార్జీ చేయడాన్ని తప్పుపట్టారు.