భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జంతువుల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో ఒకరు మరణించడం, మరొకరు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. అడవి జంతువుల వేట వారి పాలిట మృత్యువు గా దాపురించింది. అడవి జంతువుల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో ఒకరు మృతి చెందగా, ఆ మృతదేహం రెండు రోజులు అయినప్పటికీ లభించలేదు. పోలీసుల వేధింపులకు భయపడి మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. గత రెండు రోజుల నుంచి పోలీసులు మృతదేహం కోసం గాలింపు చర్యలు జరుపుతున్నా ప్రయోజనం లేకపోగా.. మరో పక్క భయంతో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో పోలీసుల అత్యుత్సహం, అటవీ శాఖ నిర్లక్ష్యం కనిపిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అడవి జంతువుల కోసం పెనుబల్లి ప్రాంతంలోని అడవి లోకి వెళ్లారు. ఈ ప్రాంతం నుంచి అడవిలోకి జంతువుల వేటకు వెళ్లడం సర్వ సాధారణంగా జరుగుతుంది. అయితే వేటకు వెళ్లేవారు విద్యుత్ తీగలను అమర్చుతారు. ఇవన్ని జరుగుతున్నాయని తెలిసినప్పటికీ అటవీ శాఖ అధికారులు అది తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా జరిగిన వ్యవహారంలో రెండు నిండు ప్రాణాలు కోల్పోయాయి. కొత్తగూడెం టూ టౌన్ పరిధిలోని పెనుబల్లి అటవీ ప్రాంతంలో అడవి జంతువుల కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ తో కొత్తగూడెం సన్యాస బస్తీకి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు.
కొత్తగూడెంకి చెందిన సునీల్ తన స్నేహితులైన మున్నా లాల్, వెంకన్నలతో కలిసి తన డబల్ బారెల్ గన్ పట్టుకుని అడవి జంతువుల షికారు కోసం అటవీ ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడ అప్పటికే జంతువుల కోసం వెళ్లిన కొంత మంది విద్యుత్ తీగెలు అమర్చారు. అలా అమర్చిన విద్యుత్
తీగెలను వెంకన్నకు తగులగా అతనిని రక్షించడానికి వెళ్లిన సునీల్ విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. దీంతో మిగిలిన ఇద్దరు భయపడి పోయి కొత్తగూడెంకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, సునీల్ మృతి చెందిన విషయాన్ని ఫిర్యాదు తీసుకున్న పోలీసులు
అసలు అది ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు అడవిలోకి పోలీసు బృందం వెళ్లింది.
రెండు రోజుల నుంచి అడవిని పోలీసు సిబ్బంది గాలింపు చర్యలను చేపట్టారు.అయితే ఇంత వరకు మృతదేహం ఆనవాళ్లు కనిపించలేదు.విద్యుత్ తీగలు పెట్టిన మరో వర్గం వేటగాళ్లు ఈ మృతదేహాన్ని మాయం చేసి ఉంటారని భావిస్తున్నారు. సరిహద్దులోని గ్రామాలకు చెందిన వారు ఇలా అడవికి వెళ్లడం జంతువులను వేటాడడం కామన్ గానే జరుగుతుంది. ఈ ఘటనలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు కొంతమంది అనుమానితులను పట్టుకున్నారు. మృతదేహం మాయం అయిన విషయం గురించి వారిని విచారిస్తున్నారు. చంటి అనే వ్యక్తి పోలీసుస్టేషన్ దగ్గరే వుండి విచారణ ఘటనను పరిశీలిస్తున్నాడు.అప్పటికే గ్రామానికి చెందిన ఆరుగురిని పోలీసులు పట్టుకెళ్లి కొట్టడం ప్రారంభించారు. చంటి గురించి పోలీసులు అడగడం ప్రారంభించారు. తనని కూడా బాగా కొడతారని భయపడ్డ చంటి పురుగుల మందు త్రాగి సీఐ వద్ద కాళ్ల మీద పడ్డాడు. అయితే అతనిని హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంటి మృతి చెందాడు. అడవిలో వేటకు వెళ్లిన ఒక్క వ్యక్తి చనిపోయాడని మమ్మల్ని తీసుకుని వచ్చి పోలీసుస్టేషన్ లో ఇష్టం వచ్చినట్లుగా కొట్టారని, ఆ దెబ్బలను చూసిన చంటి భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని చంటి బంధువు ఒకరు ఆరోపించారు.
పురుగుల మందు త్రాగి వచ్చి పోలీసుల కాళ్లను చంటి పట్టుకున్నాడని , తాను ఏ తప్పు చేయలేదని చెప్పినప్పటికి కనీసం ఆసుపత్రికి కూడా తరలించలేదని చంటి బంధువులు ఆరోపిస్తున్నారు. కనీసం జీపులో ఆసుపత్రికి తరలిస్తే బతికేవాడని, ఆడవాళ్లు ఆటో లో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారని పోలీసులు స్పందిస్తే మా వాడు బ్రతికేవాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మొత్తం వ్యవహారంలో పోలీసులు ఓవరాక్షన్ ఎక్కువగా కనిపించిందని ఆరోపణలు ఉన్నాయి. ఒక వైపు ఎయిర్ గన్ తీసుకుని జంతువుల వేటకు వెళ్లిన వారి వ్యవహార శైలి వివాదంగా మారింది. వారితో పాటు వెళ్లిన వ్యక్తి విద్యుత్ వలలో చిక్కుకుని చనిపోవడం ఆ మృతదేహం దొరకక పోవడంతో పోలీసులు సమాదానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు పెనుబల్లి గ్రామస్తుల మీద పడ్డారు. ఆ గ్రామస్తులను ఉదయం ఏడు గంటల నుంచే ఒక్కొక్కరిని తీసుకుని రావడం, వారి మీద ప్రతాపం చూపించడంతో చంటి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆసుపత్రికి తీసుకుని వెళ్లేవిషయంలో కూడా పోలీసులు సరిగ్గా స్పందించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.