Site icon NTV Telugu

Hyderabad: వరుస హత్యలు.. భయాందోళనలో నగరవాసులు

Langerhouse

Langerhouse

శాంతి భద్రతల్లో దేశంలోనే అత్యంత సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా పేరు ప్రతిష్టలను మన హైదరాబాద్ నగరం సంపాదించింది. మర్సర్ సర్వేలో సైతం ప్రపంచంలోనే 16వ స్థానం దక్కించుకుంది. తెలంగాణ సాధించిన అనంతరం పోలీసుల సంస్కరణలు, ప్రభుత్వ చర్యలు, పాలకుల ప్రత్యేక దృష్టితో శాంతిభద్రతల్లో ఎంతో మార్పు వచ్చిందని పోలీస్‌ బాస్‌లే స్వయంగా చెబుతున్నారు. కానీ, కొన్ని నెలలుగా నగరంలో చోటు చేసుకుంటున్న ఘటనలు నగరంలో మళ్లీ రౌడీల ఉనికిని వెల్లడిస్తున్నాయి. నగరంలోని సౌత్‌జోన్‌తోపాటు సెంట్రల్‌, ఈస్ట్‌, వెస్ట్‌జోన్‌లోని కొన్ని పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో చోటుచేసుకుంటున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడుల్లాంటి ఘటనలతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

నగరంలోని లంగర్‌హౌస్‌లో దారుణ హత్య జరిగింది. యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పిల్లర్ నెంబర్ 96 వై ఫైబర్ సర్కిల్ ఎదురుగా..కత్తులతో అతికిరాతకంగా హత్య చేశారు. నడిరోడ్డు మీద పడివున్న యువకుడి మృత‌దేహాన్ని చూసిన‌ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  కేసు నమోదు చేసుకుని పరిస్థితులను పరిశీలించారు. పాత కక్షల కారణంగా హత్య జరిగిందా లేక ఇతర కారణాలవల్ల జరిగిందా అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గ్యాంగ్ గా ఏర్పడి పక్కా స్కెచ్ తో హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

కాగా .. లాలాగూడ, బంజారాహిల్స్ .. మంగళ, బుధ వారాల్లో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. సికింద్రాబాద్‌ లాలాగూడలో బోరబండకు చెందిన అఫ్సర్‌ అనే వ్యక్తిని మంగళవారం రాత్రి దుండగులు పొడిచి చంపారు. ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని లాలాగూడలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. 2017లో జరిగిన హత్యకేసులో అఫ్సర్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని, ఇటీవలే జైలుకు వెళ్లివచ్చాడని తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే అతడిని చంపారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని నీలోఫర్ కేఫ్ సమీపంలో మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిల్‌తో కడుపులో పొడిచి ఓ..వ్యక్తిని హత్య చేశారు. స్నేహితులే ఈపని చేసారా? లేదా పాత కక్షల నేపథ్యంలో హత్య చేసి వుంటారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Exit mobile version