NTV Telugu Site icon

మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలి… బీజేపీ డిమాండ్ 

రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  రోజువారీ కేసులు ఆరువేలకు పైగా నమోదవుతున్నాయి.  అయితే, ఈనెల 30 వ తేదీన రాష్ట్రంలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి.  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది.  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈరోజు మీడియాతో మాట్లాడారు.  కరోనా మహమ్మారి, సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఆమె కోరారు.  
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రచారం సమయం కుదింపు వలన ఎలాంటి ఉపయోగం ఉండదని, కేసులు పెద్ద సంఖ్యలో పెరిగే ప్రమాదం ఉందని అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలని, ప్రజలను, అన్ని పార్టీల నాయకులను కరోనా నుంచి కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో ఓటర్లు కూడా ఓటింగ్ కు వచ్చే పరిస్థితి ఉండదని, ముఖ్యమంత్రి భేషజాలకు పోకుండా మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని డీకే అరుణ పేర్కొన్నారు.