దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఎలా పెరిగిపోతుందో మనందరం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మన హైదరాబాద్ నగరానికి రాకూడదంటే మనందరం బాధ్యతగా ఎవరికి వారు మొక్కలు నాటి వాటిని సంరక్షించే చర్యలు చేపట్టాల్సిందిగా ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. రహ్మత్ నగర్ డివిజన్‌లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి సంతోష్ కుమార్ మొక్క నాటారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. హైదరాబాద్ మహానగరం లాంటి ప్రదేశంలో వాహనాలు, వివిధ కంపెనీల వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. దీన్ని తగ్గించాలంటే ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉన్న కొద్ది స్థలంలోనే మొక్కలను నాటి వాటిని పెంచాలని కోరారు. ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు అభినందనలు తెలియజేశారు.
