యాదాద్రి: యాదగిరిగుట్టలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ .. హుజురాబాద్‌లో దళిత బంధును అడ్డుకునేది బీజేపీనే అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని గెలిచేది టీఆర్‌ఎస్‌యే అని పేర్కొన్నారు. కావాలనే బీజేపీ దళిత బంధును అడ్డుకుందని తెలిపారు.
బీజేపీ అండతో ఈటల ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది మాత్రం టీఆర్‌ఎస్ యే అన్నారు. రానున్న రోజుల్లో యావత్ దేశమే కేసీఆర్ బాటలో నడవనుందని జోస్యం చెప్పారు. దళిత బంధు కొత్త పథకం కాదని, ఇంతకముందు వాసాల మర్రి గ్రామంలో అమలు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కుట్రను హుజూరాబాద్ ప్రజలు గమనించాలన్నారు.
ఎన్నికల పేరుతో దళితబంధును కేంద్రం నిలిపివేయడం సరైంది కాదని, దీనిపై కేంద్రం పునరాఆలోచించాలని తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. కొందరు కావాలనే టీఆర్‌ఎస్ పార్టీ పై బురద జల్లుతున్నారన్నారు. కుల రహిత సమాజం, ఆర్థిక ఇబ్బందులు లేని నవ సమాజం కోసం సీఎం కేసీఆర్ పరితపిస్తున్నారన్నారు.