HMDA Mokila Layout : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోకిలా లేఅవుట్ మూడవ దశ (ఫేజ్-III) నివాస ప్లాట్ల ఈ-వేలానికి అద్భుతమైన స్పందన లభించింది. ఈ వేలంలో ఉంచిన మొత్తం 100 నివాస ప్లాట్లూ హాట్ కేకుల్లా విక్రయమయ్యాయి. ఈ విజయవంతమైన ప్రక్రియ ద్వారా హెచ్ఎండీఏకు సుమారు రూ. 231.65 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఈ వేలం ప్రక్రియ బిడ్డర్ల మధ్య తీవ్రమైన పోటీని సృష్టించడమే కాకుండా, మొకిల ప్రాంతానికి రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఉన్న విపరీతమైన ఆకర్షణను, క్రేజ్‌ను మరోసారి స్పష్టం చేసింది.
గరిష్టంగా రూ. 1,09,500 పలికిన చదరపు గజం ధర
ఈ వేలంలో ప్లాట్లను దక్కించుకోవడానికి కొనుగోలుదారులు పోటాపోటీగా పాల్గొన్నారు. అనేక ప్లాట్లకు ఒకటి కంటే ఎక్కువ బిడ్‌లు రావడంతో రేట్లు భారీగా పెరిగాయి. ఇందులో అత్యధిక బిడ్ ధర చదరపు గజానికి రూ. 1,09,500 గా నమోదు కాగా, సగటు బిడ్ రేటు చదరపు గజానికి రూ. 75,640 గా పలికింది. ఫేజ్-3 లో అమ్మకానికి పెట్టిన 100 నివాస ప్లాట్లు పూర్తిగా విక్రయం అవ్వడం విశేషం.
పశ్చిమ కారిడార్‌లో రియల్ ఎస్టేట్ వృద్ధికి నిదర్శనం
మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి లభించిన ఈ భారీ స్పందన హైదరాబాద్ పశ్చిమ ప్రాంత కారిడార్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి ఉన్న తిరుగులేని డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఈ విజయవంతమైన వేలం ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా, ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో అభివృద్ధిని, కొత్త పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

