MLC Kadiyam Srihari Counter To MLA Thatikonda Rajaiah Comments: వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో.. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మొదట్నుంచే వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా.. కాలక్రమంలో అది ముదురుతూ వచ్చింది. ఇప్పుడు ఆ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. ఒకరిపై మరొకరు చేసుకున్న తీవ్ర వ్యాఖ్యలే అందుకు కారణం. తొలుత ఆదివారం నిర్వహించిన ఓ సమావేశంలో.. కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో 361 మంది మావోయిస్టులు బలి అయ్యారని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ తన అడ్డా అని.. ఇక్కడ ఎవరినీ అడుగుపెట్టనివ్వబోనని శపథం చేశారు. అంతేకాదు.. ఎమ్మెల్సీలతో అభివృద్ధి జరగదని, ఎమ్మెల్యేలతోనే జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేల ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ప్రభుత్వం ఏర్పడాలన్నా.. ఎమ్మెల్యేలే ఉండాలన్నారు.
రాజయ్య చేసిన ఆ వ్యాఖ్యలతో నొచ్చుకున్న కడియం శ్రీహరి.. తాజాగా వాటికి బదులిచ్చారు. పెన్షన్ పంపీణీ కార్యక్రమంలో మాట్లాడిన రాజయ్య.. ఆ వేదికను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాజయ్య తీవ్రమైన నిరాశ, నిస్పృహలో ఉన్నారని.. ఆయన ప్రజల మద్దతును కోల్పోతున్నారని.. మతిస్థిమితం కోల్పోతున్నారని దుయ్యబట్టారు. ఆ వ్యాఖ్యల్ని రాజయ్య బేషరుతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘నీ కంటే ముందు మూడుసార్లు ప్రాతినిధ్యం వహించాను. అలాంటి నాపైనే తీవ్ర ఆరోపణలు చేస్తావా? అంటూ రాజయ్యను నిలదీశారు. రాజయ్యకు ఏదైనా సమస్య ఉంటే అధిష్టానికి చెప్పుకోవాలని, అంతే తప్ప అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. రాజయ్య విజయం కోసం తామెంతో కష్టపడ్డామని.. స్టేషన్ ఘన్పూర్ ఎవరి అడ్డా, జాగీరు కాదని తేల్చి చెప్పారు. ‘నాలుగు సార్లు గెలిచి, నియోజకవర్గానికి ఏం చేశావు?’ అంటూ ప్రశ్నించారు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఓళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. భారతదేశంలో ఉపముఖ్యమంత్రిగా భర్తరఫ్ అయిన మొదటి వ్యక్తి నువ్వేనని, అప్పుడు స్టేషన్ ఘన్పూర్ పరుపు పోలేదా? అని ఎద్దేవా కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.
