Site icon NTV Telugu

Etala Rajender: ప్రజల కష్టాలను తీర్చే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది

Etala Rajender Modi Tour

Etala Rajender Modi Tour

Etala Rajender: ప్రజల కష్టాలను తీర్చే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ప్రధాని మోడీ వరంగల్ సభపై ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ప్రధాని మోడీ వస్తున్నారని అన్నారు. ఎన్నో ఏళ్ల కల అయిన వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమిపూజ చేస్తారని అన్నారు. మొదటి సారి ప్రధాని వస్తున్న సందర్భంలో ఘనస్వాగతం పలకాలని ప్రజలను కోరుతున్నామని తెలిపారు. బీజేపీకి బలమైన కేంద్రంగా వరంగల్ జిల్లా ఉందని అన్నారు. బీజేపీ శ్రేణులు మొత్తం ప్రధాని సభ పోల్ విజయం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. కేంద్రం ధాన్యం కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చినా రాష్ట్రం రైతులకు ఇచ్చే పరిస్తితి లేదని ఆరోపించారు. ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయో తెలిసిన పార్టీ బీజేపీ అని అన్నారు. కత్తి నెత్తి కాదు అని కేసీఆర్ లాగా మేము మాట్లాడమన్నారు. పెన్షన్లు 57 ఎండ్లకే ఇస్తా అని ఇవ్వలేదని గుర్తు చేశారు. భర్త చనిపోతే భార్యకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ పై ఆధారపడే కుటుంబాలకు బార్య భర్తలిద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు.

70, 75 శాతం ప్రజలకు తెలంగాణలో వివిధరకాల ఇన్సూరెన్స్ అందుబాటులో ఉందని తెలిపారు. మిగతా వారికి ఏదైనా జరిగితే రోడ్లపై పడకుండా ఇన్సూరెన్స్ అందించే పథకం తీసుకొస్తామని ఈటల తెలిపారు. బీజేపీ నేతలు కలిసికట్టుగా ఉన్నారని, కలిసే పనిచేస్తాం, విజయం సాధిస్తామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. నేను ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. అది సాధ్యమా అని కేసీఆర్ అడిగిండని అన్నారు. అది అసాధ్యం అని కేసిఆర్ కు చెప్పిన అని ఈటల తెలిపారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినామని, లక్ష రుణమాఫీ కూడా అసాధ్యమని నేను మదనపడ్డానని అన్నారు. 4 ఏండ్లు గడిచినా లక్ష రుణమాఫీ చేయలేకపోయామన్నారు. ఎన్నికలే వచ్చినపుడు ఇష్టారీతిన హామీలు ఇస్తారని మండిపడ్డారు. బీజేపీ పై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేము తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేస్తామని అన్నారు. తెలంగాణ గడ్డ మీద 2019 నుండి బీజేపీ విజయ పరంపర మొదలైందని అన్నారు. దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, టీచర్ ఎమ్మెల్సీ లను గెలిచామని గుర్తు చేశారు. నైతికంగా మునుగొడులో విజయం సాధించామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరాలని అదిష్టానం చెప్పిందని అన్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను ఒదిలే ప్రసక్తే లేదని అన్నారు. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరని ఈటల అన్నారు. దేశంలోని స్వార్ధపరులు, స్వార్థ పార్టీలు, నేతల గురించి ప్రజలకు తెలుసని అన్నారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసని తెలిపారు. మా మీద విషం చిమ్మే ప్రయత్నం కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు చేస్తున్నారని మండిపడ్డారు. చాప కింద నీరులా మేము పని చేసుకుంటున్నామని తెలిపారు. కుట్రలను, కావాలని సృష్టించే ఆరోపణలను తెలంగాణ ప్రజలు నమ్మరని ఈటల పేర్కొన్నారు. తెలంగాణ జాతిని ఎవరు మభ్యపెట్టలేరని అన్నారు.
Etala Rajender: బీజేపీ నేతలు కలిసికట్టుగా ఉన్నాం.. కలిసే పనిచేస్తాం, విజయం సాధిస్తాం

Exit mobile version