సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారిని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు. కొమురవెళ్లి మల్లన్న మా ఇంటి కులదైవం ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఆలయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన వెల్లడించారు.
ఆలయం వద్ద భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం వల్ల నేడు కొమురవెళ్లిలో భక్తుల సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు. దేవాలయ ఆచార, సంప్రదాయంల ప్రకారమే పూజలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాలకు తావులేదని, త్వరలోనే స్వామివారి సన్నిధిలో గెస్ట్ హౌస్ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహా ఆలయాన్ని కూడా ఎంతో వైభవోపేతంగా కేసీఆర్ పునః నిర్మించారని ఆయన అన్నారు. రానున్న కాలంలో మరెన్నో ఆలయాల రూపురేఖలే మారుతాయని ఆయన అన్నారు.