NTV Telugu Site icon

Singireddy Niranjan Reddy: కాంగ్రెస్ నేతలు జీవితకాలం ఊడిగం చేసినా వారి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు

Singireddy Niranjan Reddy

Singireddy Niranjan Reddy

Singireddy Niranjan Reddy: కాంగ్రెస్ నేతలు జీవితకాలం ఊడిగం చేసినా వారి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బహిరంగసభలో కాంగ్రెస్ నేతల విమర్శలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలో అన్నీ పెండింగే అంటూ ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, కరంటు,ఫించన్, పాలన,ప్రజల సమస్యలు అన్నీ పెండింగ్ కు పర్యాయపదం కాంగ్రెస్ అంటూ ఆరోపించారు. నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలన పాపమే పాలమూరు వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వారు ఏ మొకం పెట్టుకుని పాలమూరు ప్రజలను ఓట్లు అడుగుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎప్పుడు దక్కుతుందా అని కాంగ్రెస్ నేతలు కళ్లలో వత్తులు వేసుకుని చూస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కానీ 5 దశాబ్దాల అధికారంతోనే కదా అధోగతి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో కళ్ల ముందు కనిపిస్తుందని తెలిపింది.

నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలన చూసి 2018లో ఉమ్మడి పాలమూరులో 14కు 13 స్థానాల్లో ప్రజలు పట్టంకట్టారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే పాలకుల సామర్ద్యానికి గీటురాయన్నారు. అయిదు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేసిన అన్యాయానికి కాంగ్రెస్ నేతలు జీవితకాలం ఊడిగం చేసినా వారి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లాలో స్థానం లేదు, వారి పొలిటికల్ డ్రామాలు ఇక్కడ పండవని ఎద్దేవ చేశారు. కర్ణాటక ఫలితాలు చూసి కాంగ్రెస్ నేతలు పగటికలలు కంటున్నారని తెలిపారు. అక్కడ ప్రత్యామ్నాయం లేక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారని అన్నారు. అక్కడ అధికారం రాగానే ఇక్కడ కాంగ్రెస్ నేతలకు ఆశలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఒకరిపై ఒకరుపై చేయి సాధించే పవర్ కోసమే వారి పాదయాత్రలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ కట్టప్పలే.. పాలమూరు ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసి, పోతిరెడ్డిపాడుతో వెన్నుపోటు పొడిచి, పాలమూరు ప్రజలను వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యల పాలు చేశారని మండిపడ్డారు.

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల మీద కేసులు వేసి అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు ఎందుకు ఆలస్యం అయ్యిందనడం ఆశ్చర్యకరమన్నారు. 9 ఏళ్లలో పాలమూరు వ్యవసాయరంగ స్వరూపం మారిపోయిందని అన్నారు. నడి ఎండాకాలంలో చెరువుల్లో ఉన్న నీరే కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు సమాధానమన్నారు. నాడు మీ పాలనలో అంబలికేంద్రాలు, గంజి కేంద్రాలు ఉండేవి .. నేడు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని అన్నారు. నాడు మీ పాలనలో గ్రామాల్లో సాగునీరే కాదు తాగునీటికీ ఇబ్బందులే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. అధికారం మీద కాంగ్రెస్ దింపుడుకళ్లెం ఆశతో ఉందని తెలిపారు. ఈ సారి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మాదిరే అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు నోటి కొచ్చినట్లు మాట్లాడడం మాని మీ పాలనలో జరిగిన అన్యాయాలకు పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలని సూచించారు. 1946 – 51 మధ్యకాలంలో, 1969 తెలంగాణ ఉద్యమంలో, మలిదశ (2001 – 2014) తెలంగాణ ఉద్యమంలో యువకుల కాల్చివేత, అమరత్వం, కాంగ్రెస్ పార్టీని ఎల్లకాలం పట్టి పీడిస్తుందని అన్నారు.
BIG Breking: ఆలయంలో అపచారం.. దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈతకొట్టిన ఈవో