Site icon NTV Telugu

Malla Reddy: ఎస్‌ఐ కాలర్‌ పట్టుకొని అహంకారాన్ని ప్రదర్శించడం దుర్మార్గం

Mallareddy

Mallareddy

హైదరాబాద్‌లో మహిళా కాంగ్రెస్‌ నేత ఎస్‌ఐ కాలర్‌ పట్టుకొని తన అహంకారాన్ని ప్రదర్శించడం దుర్మార్గమని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వం ఊరుకోదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీజేపీ నేతల వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు.

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆందోళనలు చేయడం దేనికని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ దివాళా తీసిందని, అలాగే బీజేపీ గ్రాఫ్‌ రోజురోజుకు పడిపోతుందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు లేని సమస్యను సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ నేతలకు దమ్ముంటే ఢిల్లీలోని ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలకు ఢిల్లీలో నోటీసులు ఇస్తే రాష్ట్రంలో ఆందోళనలు చేయడమేంటని ప్రశ్నించారు. గురువారం బీఆర్‌కే భవన్‌ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌, బీజేపీ నేతల వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నేతలకు ఆ పార్టీ నాయకులపై ప్రేముంటే ఢిల్లీకి వెళ్లి ప్రధాని కార్యాలయం, ఇంటి ఎదటో.. లేదంటేఈడీ కార్యాలయం ముందో ధర్నా చేయాలన్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, ఇలాంటి వాతావరణాన్ని కలుషితం చేసి, ప్రజల్లో గందరగోళం సృష్టించాలని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ పోటీపడుతున్నాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై స్పష్టమైన అవగాహన, పట్టుదల ఉన్న నాయకుడని ఆయన పేర్కొన్నారు. సమయం..సందర్భం వచ్చినప్పుడు స్వయంగా సీఎం కేసీఆరే అన్ని విషయాలు వెల్లడిస్తారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఐరన్‌ లెగ్‌లేనని ఆయన దుయ్యబట్టారు. వాళ్లిద్దరూ ఎక్కడ అడుగుపెడితే ఆ ప్రాంతంలో వర్షాలే పడవని విమర్శించారు.

Aadhaar: పుట్టగానే ఆధార్‌ నంబర్‌.. ఆస్పత్రిలోనే కేటాయింపు..!

Exit mobile version