మహాత్మా గాంధీ చూపించిన బాటలో తెలంగాణ సీఎం కేసీఆర్ నడుస్తున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు 2001లోని ఓ పేపర్ క్లిప్పింగ్‌ను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. కరీంనగర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ‘కేంద్రాన్ని దారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం’ అంటూ అప్పట్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి పత్రికలో వచ్చిన వార్తను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. ఆనాడు కేసీఆర్ అన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని.. కానీ ఆనాడు కేసీఆర్ చేసిన సాహసోపేత ప్రకటనను రాజకీయ ప్రత్యర్థులు అవహేళన చేశారని.. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణగా తయారవుతోందని కేటీఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అగ్రస్థానంలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. మొదట మనల్ని పట్టించుకోరని, ఆ తర్వాత వాళ్లే మనల్ని చూసి నవ్వుతారని, ఆ తర్వాత వాళ్లు మనతో పోరాడుతారని, ఆ పోరాటంలో మనం గెలుస్తామని గాంధీ చెప్పిన సూక్తుల్ని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో పోస్టు చేశారు.
