NTV Telugu Site icon

Minister KTR: ఆ గట్టున రాబందు మోడీ.. ఈ గట్టున రైతుబంధు కేసీఆర్

Ktr Road Show

Ktr Road Show

Minister KTR Speech In Naranapuram Road Show: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం నారాయణపురంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నిక రాజగోపాల్, ప్రభాకర్ రెడ్డి, స్రవంతి మధ్య పోటీ కాదని.. రెండు భావజాలాల మధ్య పోటీ అని పేర్కొన్నారు. ఆ గట్టున రాబందు మోడీ ఉంటే, ఈ గట్టున రైతుబంధు కేసీఆర్ ఉన్నారని.. మునుగోడు ప్రజలు ఏ గట్టున ఉంటారో నిర్ణయించుకోవాలని సూచించారు. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే.. 14 నెల‌ల్లోనే తాము మునుగోడును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు, కాలేజీలు, పోడు భూముల సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తనదేనన్నారు.

మందు, మ‌ట‌న్ పెట్టగానే గంద‌ర‌గోళానికి గురి కావొద్దని.. ఎవ‌రి వ‌ల్ల మ‌న బ‌తుకులు బాగుప‌డుతాయో ఆలోచించుకోవాలని కేటీఆర్ కోరారు. మ‌న‌ది పేద‌ల ప్రభుత్వమని.. బీజేపీది మాత్రం పెద్దల ప్రభుత్వమని విమర్శించారు. 18 వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజ‌గోపాల్.. ఇంటింటికీ తులం బంగారం ఇచ్చినా ఇస్తాని, అలా ఇస్తే ఆ బంగారాన్ని తీసుకోవాలని, ఎందుకంటే అవన్నీ దొంగల పైసలని ఆరోపించారు. బీజేపీకి ఓటుతోనే స‌మాధానం చెప్పాలన్నారు. డబ్బుకో, మందుకో లొంగిపోయి బీజేపీకి ఓటు వేస్తే.. మ‌న కంట్లో మ‌న‌మే పొడుచుకున్నట్టు అవుతుందని తెలిపారు. ఆగం కాకుండా ఆలోచన చేయమన్న కేటీఆర్.. మునుగోడును స‌స్యశ్యామ‌లం చేయబోతున్నామని, రాచకొండకి కూడా లిఫ్ట్‌లు పెట్టిస్తామని మాటిచ్చారు.

సాధారణంగా ఎమ్మెల్యేలు పైకి పోతే ఉప ఎన్నిక వస్తుందని.. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోవడం వల్ల ఉప ఎన్నిక వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. 18 వేల కాంట్రాక్ట్‌కు మునుగోడు ఆత్మగౌరవాన్ని రాజగోపాల్ తాకట్టు పెట్టారని, నాలుగేళ్లలో ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించారు. అటు కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక ఒక్క మంచి పని కూడా చేయలేదని, మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక సిలిండ‌ర్ ధ‌ర రూ. 1200ల‌కు, పెట్రోల్ ధ‌ర రూ. 110 పెరిగిందని పేర్కొన్నారు. పలివెలలో బీజేపీ గుండాలు దాడులు చేశారని, ఓడిపోయేటోడే ఇలా చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు పోలిన గుర్తులను కొందరు దొంగలు తీసుకొచ్చారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.