Minister KTR Open Letter To Narendra Modi Over Rojgar Mela: ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజ్‌గార్ మేళా పచ్చి దగా అని, యువతను మరోసారి మోసం చేసేందుకే దీన్ని తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. నమో అంటే నమ్మించి మోసం చేసేవాడని రుజువైందంటూ విమర్శించారు. ప్రతి ఎన్నికల ముందు యువతను మోసపుచ్చే ఇలాంటి ప్రచార కార్యక్రమాలను పక్కన పెట్టి.. నిబద్దతతో నిరుద్యోగ సమస్యపైన దృష్టి సారించాలని మోడీకి సూచించారు. హిమాచల్, గుజరాత్ ఎన్నికల ముందు మోడీ మరో కొత్త డ్రామాకి తెరతీశారని మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను నింపుతామని చెప్పిన మోడీ.. మరి 16 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందంటూ నిలదీశారు.
మీ బీజేపీ ప్రభుత్వం హయాంలో ఇప్పటివరకూ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని కేటీఆర్ నిలదీశారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం.. 2,24,000 ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు సూమారు 16.5 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రైవేట్ రంగంలో కల్పిస్తోందన్నారు. మరి.. ఒక కేంద్ర ప్రభుత్వంగా మీరు దేశవ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలి కల్పించాలి? అని ప్రశ్నించారు. ఏటా 50 వేల ఉద్యోగాలను సరిగ్గా భర్తీ చేయని మీరు.. రోజ్‌గార్ మేళా పేరుతో కేవలం 75 వేల మందికి నియామక పత్రాల అందచేయడాన్ని దేశ నిరుద్యోగులు గమనిస్తున్నారని తెలిపారు. 75 వేల ఉద్యోగాల పేరుతో మీరు చేస్తున్న రోజ్‌గార్ ప్రచారం, దేశ నిరుద్యోగ యువతపైన మీరు చేస్తున్న కృర పరిహాసమేనని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి మాదిరే ఈసారి కూడా ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తే.. మీ పాలనపై, ప్రభుత్వంపై తిరగబడే రోజు త్వరలోనే వస్తుందని మోడీని కేటీఆర్ హెచ్చరించారు.
అంతకుముందు కూడా ప్రధాని మోడీపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విఫల ఆర్థిక విధానాలకు బాధ్యత వహిస్తూ, బ్రిటన్ ప్రధాని కేవలం 45 రోజుల్లోనే రాజీనామా చేశారని.. మరి మీరెప్పుడు బాధ్యత వహిస్తారంటూ మోడీని ప్రశ్నించారు. 30 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం, 45 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం, ప్రపంచంలోనే అత్యధిక ఎల్‌పీజీ ధరలు, అత్యల్ప రూపాయి వర్సెస్ యూఎస్ డాలర్ మొదలైనవి మనకు మన భారత ప్రధాని ఇచ్చారంటూ.. కేటీఆర్ ట్విటర్ మాధ్యమంగా ఎద్దేవా చేశారు.
