NTV Telugu Site icon

KTR:2072 వ‌ర‌కు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ప్లాన్

Ktr6

Ktr6

హైద‌రాబాద్ న‌గ‌రానికి 2072 వ‌ర‌కు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందస్తుగా ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. న‌ల్ల‌గొండ జిల్లా నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద సుంకిశాల ఇన్‌టెక్ వెల్ ప‌నుల‌కు కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్ రంగారెడ్డి మేడ్చ‌ల్ జిల్లాల ప్ర‌జ‌ల‌కు నిజంగా ఇవాళ‌ శుభ‌దినం అని పేర్కొన్నారు. వ‌రుస‌గా ఏడేండ్లు క‌రువు వ‌చ్చినా తాగునీటికి తిప్ప‌లు లేకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. హైద‌రాబాద్ చుట్టుతా కూడా వాట‌ర్ పైప్ లైన్‌ల‌ను ఏర్పాటు చేశారు.

భ‌విష్య‌త్‌లో హైద‌రాబాద్ న‌గ‌రం 100 కిలోమీట‌ర్ల విస్త‌రించిన తాగునీటికి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుప‌లా, బయట ఉన్న ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేశామ‌న్నారు. హైద‌రాబాద్ తాగునీటి అవ‌స‌రాల నిమిత్తం..

మెట్రో వాట‌ర్ స‌ప్లై, సీవ‌రేజ్ బోర్డు ఆధ్వ‌ర్యంలో రూ. 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుత‌ హైద‌రాబాద్‌లో నీటి అవ‌స‌రాలు 37 టీఎంసీలు.. 2072 వ‌ర‌కు ఆలోచిస్తే ఇది పెరిగి మ‌రో 34 టీఎంసీల అవ‌స‌రం ఉంటుంది.

దాదాపు 71 టీఎంసీల నీరు అవ‌స‌రం ఉండే అవ‌కాశం ఉంది. 2035 నాటికి 47 టీఎంసీలు, 2050 నాటికి 58 టీఎంసీలు, 2065 నాటికి 67 టీఎంసీలు, 2072 నాటికి 70.97 టీఎంసీల నీరు అవ‌స‌రం ఉంటుందని అంచ‌నా వేశామ‌న్నారు.

సుంకిశాల‌లో 1450 కోట్ల అంచ‌నా వ్య‌యంతో తాగునీటి అవ‌స‌రాల నిమిత్తం పంపులు, మోటార్లతో పాటు అద‌నంగా 16 టీంఎసీలు లిఫ్ట్ చేయ‌డానికి ప‌నులు చేప‌ట్ట‌నున్న‌ట్లు పేర్కొన్నారు. రాబోయే ఎండ‌కాలం నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందిస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని భ‌విష్య‌త్ త‌రాల‌కు బ్ర‌హ్మాండ‌మైన అసెట్‌గా అందించాల‌ని, భ‌విష్య‌త్‌ భార‌త‌వాణికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా భాగ్య‌న‌గ‌రంలో కార్య‌క్ర‌మాలు చేయాల‌ని, ఆ విధంగా తీర్చిదిద్దాల‌ని సీఎం కేసీఆర్ త‌మ‌కు ఎప్పుడూ చెప్తుంటార‌ని కేటీఆర్ వెల్ల‌డించారు.