Site icon NTV Telugu

Minister KTR: హిందూ-ముస్లిం అనగానే ఆగం కావొద్దు

Minister Ktr

Minister Ktr

Minister KTR Inaugurates Acharya Konda Laxman Bapuji Statue In Rajanna Sircilla: మతం పేరుతో రాజకీయాలు చేసే నాయకుల మాటలు పట్టించుకోవద్దని.. హిందూ-ముస్లిం అనగానే ఆగం కావొద్దని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్లలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన ఆయన.. కులం, మతం పేరుతో చేసే రాజకీయాలపై ప్రజలు నిగ్గుదీయాలని పేర్కొన్నారు. ఆవేశపడకుండా, ఈ ఎనిమిదేళ్లలో ఎవరేం చేశారో అర్థం చేసుకోవాలన్నారు. కాళేశ్వరంకు, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వలేదన్నారు.

97 ఏళ్లు జీవించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ.. స్వాతంత్ర పోరాటంతో పాటు అనేక ఉద్యమాలు చేశారని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్వాతంత్ర రాకముందే కాదు, వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమంలో ముందంజలో ఉన్నారన్నారు. ఉద్యమంలో తాను పోరాటం చేయడమే కాకుండా, పోరాట యోధులకు సహకారం అందించారన్నారు. తెలంగాణ వైతాళికుల గొప్పదనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటు చేపట్టిందన్నా్రు. మహనీయుల్ని కడుపులో పెట్టుకొనే సంస్కారం తమ ప్రభుత్వానికి ఉందని.. ఎవరూ అడగకుండానే తాము తెలంగాణలోని కొత్త జిల్లాలకు, యూనివర్సిటీలకు, సంస్థలకు తెలంగాణ వైతాళికుల పేర్లు పెట్టామని తెలిపారు. నేతన్నల వస్త్రాలపై వేసిన జీఎస్టీని రద్దు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు.

అంతకుముందు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించిన కేటీఆర్.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో భేటీ అయ్యారు. ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమన్వయంతో ట్రిపుల్ ఐటీని మరింత అభివృద్ధి చేస్తామని, టీ-హబ్ సెంటర్ సహా మినీ స్టేడియం, అధునాతన కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

Exit mobile version