Site icon NTV Telugu

Minister KTR: ఇది కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ఆత్మగౌరవానికి మధ్య పోటీ

Ktr Fires On Rajagopal Redd

Ktr Fires On Rajagopal Redd

Minister KTR Fires On Rajagopal Reddy In Munugode By Election Campaign: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్.. రాజగోపాల్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, డబ్బు మదం ఉన్న ఓ కాంట్రాక్టర్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని మండిపడ్డారు. ఇది మునుగోడు ప్రజల మీద బలవంతంగా రుద్దబడిన ఎన్నిక అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో తెరాస భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్.. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తాగు, సాగు నీటి, విద్యుత్ సమస్యల్ని పరిష్కరించిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ, వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు.

కాంట్రాక్టులు పొంది వచ్చే లాభంతో రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి నిర్వహిస్తున్న ఒక చిన్న కంపెనీకి, అంత పెద్ద కాంట్రాక్ట్ ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న పెద్దలు ఎవరు? అని ప్రశ్నించారు. చేనేతకు 5 శాతం జీఎస్టీ వేసి.. చేనేత కార్మికుల మరణ శాసనాన్ని రాసిన ఘనత బీజేపీదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టు పనులకు అడ్డం పడుతోందెవరో అందరికీ తెలుసని అన్నారు. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే.. మునుగోడు నియోజకవర్గాన్ని తానే దత్తత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు ఓసారి సమీక్ష సమావేశాలు నిర్వహించి, నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చండూరు ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీకి కేటీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి కోనమనేని సాంబశివరావు వచ్చారు.

Exit mobile version