NTV Telugu Site icon

KTR: ప్రధానికి ఘాటుగా కౌంటర్‌.. ఇలా చేస్తే రూ.70కే లీటర్‌ పెట్రోల్‌..!

Ktr

Ktr

దేశవ్యాప్తంగా పెట్రో ధరలపై చర్చ సాగుతూనే ఉంది.. బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు.. బీజేపీయేతర పాలనలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఎలా ఉన్నాయో తెలుపుతూ.. పోస్టులు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.. ఇక, తెలంగాణలో పెట్రో ధరలకు కారణం ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీయేనని బీజేపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ పేరు ప్రస్తావించడంలో మంత్రి కేటీఆర్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది.. దీంతో.. ప్రధాని మోడీకి సోషల్‌ మీడియా వేదికగా ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.

Read Also: Patnam Mahender Reddy: సీఐపై టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ బూతు పురాణం..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో.. ఇవాళ కోవిడ్‌ పరిస్థితిపై రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైన మోడీ.. ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు.. ఇదే సమయంలో, వ్యాట్‌ గురించి ప్రస్తావించారు. వ్యాట్‌ తగ్గించని రాష్ట్రాలంటూ తెలంగాణ స్టేట్‌ పేరును కూడా ప్రస్తావించారు ప్రధాని.. దీనిపై సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. కేంద్రం విధానాలే కారణమంటూ కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు.. ఇలా ప్రత్యేకంగా ఒక రాష్ట్రం పేరు చెప్తారా? ఏ కో-ఆపరేటివ్‌ ఫెడరలిజం గురించి మీరు మాట్లాడేది అంటూ మోడీని నిలదీసిన కేటీఆర్.. వ్యాట్‌ తగ్గించమని తమ రాష్ట్రం పేరు ఎందుకు ప్రస్తావిస్తారని నిలదీశారు.

అసలు, తాము వ్యాట్‌ పెంచలేదని స్పష్టం చేసిన ఆయన.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగింది కేవలం కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లేనని విమర్శించారు.. 2014 నుంచి ఇప్పటి వరకు తాము వ్యాట్‌ను పెంచలేదని గుర్తుచేసిన కేటీఆర్.. మీ ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్‌లో మా చట్టబద్ధమైన హక్కు 41 శాతం వాటా రావడం లేదని దుయ్యబట్టారు.. సెస్‌ పేరుతో రాష్ట్రం నుంచి మీరు 11.4 శాతం వాటాను లూటీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. 2022-23 ఏడాదిలో మాకు కేవలం 29.6 శాతం మాత్రమే వస్తోంది.. దయచేసి సెస్‌ను రద్దు చేయండి.. అప్పుడు దేశవ్యాప్తంగా పెట్రోల్‌ రూ. 70కి, డీజిల్‌ రూ. 60కు వస్తుందని సూచిస్తూ.. వన్‌ నేషన్‌ – వన్‌ రేటు? అంటూ ట్వీట్‌ చేశారు కేటీఆర్.