NTV Telugu Site icon

Harish Rao: కేసీఆర్‌ కారణజన్ముడు.. తెలంగాణ ఆదర్శంగా నిలిచింది

కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు.. ప్రాజెక్టులు నిర్మాణం అయ్యేవి కావు.. నీళ్లు వచ్చేవి కావు.. ఆయన కారణజన్ముడు అంటూ ప్రశంసలు కురిపించారు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు గోదావరి నీటిని విడుదల చేసిన మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణ ను అన్ని రంగాలలో ముందంజలో నిలుస్తుందన్నారు.. 7 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలిపారని.. కేంద్రం అనేక షరతులు, నిబంధనలు పెడుతూ.. ప్రాజెక్ట్ లకు నిధులు రాకుండా అడ్డు పడుతుందని మండిపడ్డారు.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, REC నుంచి అప్పుగా నిధులు రాకుండా అడ్డు పడుతుందని ఆరోపించిన ఆయన.. అత్యుత్తమ ఆర్థిక విధానాలతో ఏడేళ్లలో తెలంగాణ జీఎస్‌డీపీని రెట్టింపు చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణను నంబర్‌ వన్‌గా నిలిపారు.. అసలు కేసీఆర్‌ లేకపోతే స్వరాష్ట్రం తెలంగాణ లేదు.. తెలంగాణ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు… రంగనాయక సాగర్ జలాశయం ఉండేది.. సిద్దిపేట ప్రాంతానికి సాగు జలాలు వచ్చేవి కావన్నారు హరీష్‌రావు.

Read Also: TTD: టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలు పెంపు

నియోజక వర్గ రైతాంగానికి నీళ్లు వదలడం చాలా సంతోషంగా ఉందన్నారు హరీష్‌రావు.. ప్రజల ఆకాంక్షలను కేసీఆర్‌ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్న ఆయన.. ఒకప్పుడు తెలంగాణ గుక్కెడు తాగునీటి కోసం కష్టాలు పడ్డది నేడు సాగునీరు ఇస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని.. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకున్నా, ప్రాజెక్ట్‌లకు అడ్డుపడుతున్నా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.. సిద్దిపేటతో పాటు సిరిసిల్ల, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు నీరు అందిస్తామని తెలిపిన హామీ ఇచ్చిన హరీష్‌రావు.. రైతాంగానికి బంగారు పంటలు పండే నీరు అందిస్తున్నారు అంటూ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.. గతంలో రైతులు చెమట చుక్కలతో కష్టపడి సంపాదించిన డబ్బు బోరు బావులకే సరిపోయేదని.. గత ప్రభుత్వాల హయాంలో కాలిపోయిన మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లతో అప్పుల పాలు అయ్యేవారని గుర్తుచేశారు.. కలలో కూడా ఊహించలేదు గోదావరి నీళ్లు వస్తాయని.. కానీ, అది సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యం అయ్యిందని.. రాష్ట్ర ప్రజల పక్షాన సీఎం కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు మంత్రి హరీష్‌రావు.