Minister Harish Rao Lays Foundation Stone To MCH Hospital AT NIMS: రాష్ట్రంలో మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టాయని, ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని మంత్రి హరీశ్‌రావు తెలియజేశారు. ఎర్రమంజిల్‌లో నిమ్స్‌కు అనుబంధంగా 200 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన.. ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. గతంలో రాష్ట్రంలో కేవలం మూడు ఎంసీహెచ్ ఆసుపత్రులు మాత్రమే ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 27కు పెరిగిందని అన్నారు. ఎంసీహెచ్ ఆసుపత్రుల నిర్మాణానికి రూ. 499 కోట్లు ఖర్చు చేశామని తెలిపిన ఆయన.. ఈ ఆసుపత్రులను 27కి పెంచడం వల్లే మాతాశిశు మరణాలు తగ్గాయన్నారు.
Bhatti Vikramarka: తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేదు.. కేసీఆర్ మోసం చేశారు
తెలంగాణ ఏర్పడక ముందు మాతా మరణాలు ప్రతి లక్షకు 92, శిశు మరణాలు 36గా ఉండేవని.. ఇప్పుడు ఆ సంఖ్యలు వరుసగా 43. 21కి తగ్గించుకున్నామ్నారు. ఈ మరణాల రేటు తగ్గుముఖం పట్టడంలో దేశంలో మూడోస్థానంలో ఉన్నామని, మొదటి స్థానానికి వెళ్లాలని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రిలో 200 పడకలు, నిమ్స్‌లో 200 పడకలు, అల్వాల్‌లో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ ఆసుపత్రుల్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలోకి కానీ 100 పడకల డయాలసిస్ యూనిట్ లేదని.. నిమ్స్‌లో కేవలం 34 డయాలసిస్ బెడ్లు ఉండగా, వాటిని 100కు పెంచుకుంటున్నామని చెప్పారు. డయాలసిస్ రోగులను కాపాడుకునేందుకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నామని.. ఆసరా పెన్షన్లు, ఉచిత బస్‌పాస్‌లను కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులను కూడా పెంచుతున్నామన్నారు.
Nidhhi Agerwal: మొన్న రష్మిక.. నేడు నిధి.. ఏం చేస్తున్నావయ్యా వేణుస్వామి
అనంతరం నిమ్స్‌లో కొత్తగా నియామకమైన 26 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి హరీశ్ రావు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా.. నిమ్స్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో ఉద్యోగంలో చేరడం ఎంతో గౌరవాన్ని ఇస్తుందన్నారు. నిమ్స్‌లో తొలిసారి అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వుమెన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేశామని తెలిపారు. ఇంతవరకు నిమ్స్‌లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండేది కాదని.. సీఎం కేసీఆర్ సూచన మేరకు అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేశామని స్పష్టం చేశారు. నిమ్స్‌కు అధికంగా గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారని.. అలాంటి వారికి మంచి వైద్యం ఇవ్వాలని కోరుతున్నానని తెలిపారు. రోగుల పట్ల ప్రేమ, మమకారం, ఆప్యాయత చూపిస్తే.. అది రోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాలను పెట్టుకోకుండా.. టీమ్ వర్క్‌గా పని చేయాలని, ప్రజల కోసం పని చేయాలని, అప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయని సూచించారు.