NTV Telugu Site icon

Minister Harish Rao: మోదీజీ.. పేదలు ఏం పాపం చేశారు?

Harish Rao Fires On Modi

Harish Rao Fires On Modi

Minister Harish Rao Fires On PM Narendra Modi In Sangareddy: సంగారెడ్డిలో పర్యటించిన మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా బీజేపీ, ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. మొన్న తెలంగాణలో పర్యటించినప్పుడు ఉచితాలు ఇవ్వొద్దని మోదీ అన్నారని, మరి మీరు మాత్రం అదాని, అంబానీల కోసం పని చేయొచ్చా? అంటూ ప్రశ్నించారు. పేదలు ఏం పాపం చేశారని నిలదీసిన ఆయన.. వారికి ఉచితాలు ఎందుకు ఇవ్వకూడదని, మీరు పెద్దలకు ఎందుకు ఇస్తున్నారని అడిగారు.

భారీ వర్షాల కారణంగా వరదలు వస్తే.. సీఎం కేసీఆర్ ఒక్కరే ఈ పరిస్థితిని పరిష్కరించారని, కాంగ్రెస్ – బీజేపోల్లు హైదరాబాద్‌లోనే ఉండి ఏమీ చేయలేకపోయారన్నారు. కడెం ప్రాజెక్టుకు చరిత్రలో లేనంత వరద వచ్చినా, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చుసుకున్నామన్నారు. ప్రతిపక్షాలు కేవలం బురద రాజకీయాలు చేస్తున్నాయని, తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని, వరద సహాయం కూడా చేయలేదని విమర్శించారు. సహాయం చేయకుండా తిడితే, ప్రజలు మిమ్మల్ని క్షమించరన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని చెప్పిన మంత్రి హరీష్.. సాయం పొందిన చేతులు దీవెనలు అందిస్తాయని చెప్పారు.

బీజేపీ అధికారంలోకి వస్తే.. బాయిల దగ్గర కూడా మీటర్లు పెడతారని, పెన్షన్లు తగ్గిస్తారని, కల్యాణ లక్ష్మీ కూడా ఇవ్వరని హరీష్ పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. పేదల కడుపు కొట్టి, గద్దలకు పంచుతుందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ చట్ట సభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తోందని, కేంద్రం మాత్రం మహిళలకు ప్రాధాన్యమిస్తామంటూ 8 ఏళ్ల నుంచి నాన్చుతూనే వస్తోందని కడిగిపారేశారు. బేటీ బచావో బేటీ పడావో అని గొప్ప మాటలు చెప్పుకోవడానికే బీజేపీకి సరిపోయిందని కౌంటర్లు వేశారు. డబుల్ ఇంజన్ అని బీజేపీ మొత్తుకుంటోందని మండిపడ్డారు.

ఇదే సమయంలో సంగారెడ్డిలో రూ. 50 కోట్లలో గల్లీల్లోనూ రోడ్లు వేస్తామని, వచ్చే ఆగస్టు నాటికి రోడ్లు సహా డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని తాను కలెక్టర్‌కి ఆదేశాలిచ్చానని హరీష్ రావు చెప్పారు. మంచి నీళ్ళ కోసం సీఎం కేసీఆర్ రూ. 15 కోట్లు ఇచ్చారని, ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నాం, ఆరునెలల్లో స్వచ్ఛ సంగారెడ్డిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే సంగారెడ్డిలో రూ. 500 కోట్లతో మెడికల్ కాలేజ్ కట్టుకున్నామని, రాబోయే రోజుల్లో 600 పడకలతో హాస్పిటల్ కూడా కడుతామని అన్నారు. సంగారెడ్డిలో బస్తీ దవాఖాన కూడా ఉందని తెలిపారు.

నార్మల్ డెలివరీనే అందరూ కృషి చేయాలని, అలా చేస్తే తల్లితో పాటు బిడ్డకి మంచిదని హరీష్ చెప్పారు. పైసలుంటే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లండని, పేదలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికే రావాలని ఆయన పిలుపునిచ్చారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, 100 మంది డాక్టర్లు పనిచేస్తున్నారు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండని సూచించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే టీఆర్ఎస్ కాకపోయినా, పనులన్నీ పూర్తి చేస్తామని భరోసానిచ్చారు. ఇప్పటికే 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం, కొత్తగా 12 లక్షల మందికి పెన్షన్లు ఇస్తాం, ఇల్లు లేని వారికి త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హరీష్ రావు వెల్లడించారు.