NTV Telugu Site icon

బండి సంజయ్ కు సవాల్ విసిరిన హరీష్ రావు

హైదరాబాద్‌లో కాకుండా న్యూఢిల్లీలో ‘మిలియన్‌ మార్చ్‌’ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సవాల్‌ విసిరారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌వీ, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. తమ హయాంలో ఎన్ని ఖాళీలున్నాయో వెల్లడించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 15 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దేశంలోని అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి టైమ్ ఫ్రేమ్ ప్రకటించాలని మోదీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. “నిరుద్యోగ యువత గురించి బండి సంజయ్ ఆందోళన చెందుతుంటే, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి తన పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి అతను న్యూఢిల్లీలో మిలియన్ మార్చ్ చేపట్టాలి.” అన్నారాయన.

కేంద్ర బడ్జెట్‌లో ఎన్‌ఆర్‌ఈజీపీ నిధులను తగ్గించడంపై కేంద్రం ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి అన్నారు. దళితులు, పేదల అభ్యున్నతి కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కలలుగన్న లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు, అధికారాల పంపిణీపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలి’’ అని అన్నారు.