NTV Telugu Site icon

కోవిడ్ ఐసోలేషన్ విభాగాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి….

కోవిడ్ బాధితుల‌కు వైద్య సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ముఖ్య‌మంత్రి కేసిఆర్ గారు అన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్నార‌ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈరోజు తొర్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ 30 పడకల విభాగాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఓ.పి, ఆక్సిజన్ తో కూడిన బెడ్స్ వంటి వైద్య సౌకర్యాలను మంత్రి సందర్శించి పరిశీలించారు. కోవిడ్ పేషెంట్లు అధైర్య పడరాదని వైద్య చికిత్స కొరకు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా వైద్య సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామ‌ని అన్నారు. అంతేకాకుండా వైద్యసౌకర్యాలు మరింత మెరుగుపరిచేందుకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించిన‌ట్లు చెప్పారు.

ఆసుప‌త్రుల్లో ఆక్సిజన్ కొరత రాకుండా ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్యేక చర్యలు తీసుకుంటుంద‌ని, అందుకు వైద్యులు కోవిడ్ బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేయాల‌ని కోరారు. ఆసుప‌త్రుల్లో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, అవసరమైతే తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలి ఆదేశించారు. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వైద్యశాలను పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా దాతలు అందించిన మాస్క్లను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు పంపిణీ చేశారు. ప్రజ‌లు కోవిడ్ వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌హిరంగ ప్ర‌దేశాల్లో తిర‌గ‌వ‌ద్ద‌ని కోరారు. కోవిడ్ నిబంధ‌న‌లు అతిక్ర‌మించే వారిపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు.