NTV Telugu Site icon

Errabelli Dayakar Rao: పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు గల్లీ నుంచి ఢిల్లీకి

Yerrabelli

Yerrabelli

పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇక్కడి గల్లీల నుంచి ఢిల్లీకి చేరాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఐదో విడుత పల్లె ప్రగతిలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ..పల్లె ప్రగతి ద్వారా మన గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయని అన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ చొరవ, అధికారుల శ్రమ, ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమయిందని తెలిపారు. ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని, దానికి తగినట్లుగా అవసరమైన నిధులు ఇస్తున్నారని చెప్పారు.

గ్రామాల్లో అన్ని సదుపాయాలు సమకూరుతున్నాయని, సర్వాంగ సుందరంగా తయారయ్యాయని చెప్పారు. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు వలసలు ఉండేవని, ఇప్పుడు అవి తగ్గి.. పల్లెలకు వలస మొదలైందన్నారు. గ్రామంలో పచ్చదనం పెంచేందుకు నర్సరీలు, డంపింగ్‌ యార్డులు, చెత్తను వేరు చేసే పద్ధతి, అంతిమ సంస్కారాలకు వైకుంఠ ధామాల వంటివి పల్లెప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసుకున్నామన్నారు.

గ్రామాల్లో రైతు వేదికలు, కల్లాలు, రైతులకు ఎదురు పెట్టుబడి, రైతు బీమా, పెన్షన్లు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, ఇలా అన్ని సదుపాయాలు ఎప్పుడూ జరగలేదని, కేవలం సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమయ్యాయని మంత్రి చెప్పారు. ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నయా పైసా బాకీలేకుండా ఇచ్చేసిందని వెల్లడించారు. కేంద్రం నుంచి రూ.1450 కోట్ల నిధులు రావాల్సి ఉందని వెల్లడించారు.

KTR: ఓట్లు కోసం ప‌చ్చ‌గా ఉన్న దేశంలో చిచ్చుపెట్టారు