Site icon NTV Telugu

MEDIPALLY MURDER: మూసీ వైపు దారితీసిన రహస్య ప్రయాణం

Medipally Murder

Medipally Murder

MEDIPALLY MURDER: ప్రేమించి.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. ఆర్థికంగా నిలదొక్కుకుని.. గొప్పగా జీవించాలనుకున్న తాపత్రయంతో సంసారం హైదరాబాద్‌లో పెట్టాడు. కోరి పెట్టుకున్న కాపురంలో కలహాలు మొదలయ్యాయి. చీటికిమాటికి భార్య, భర్త గొడవ పడ్డారు. పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టుకున్నారు. తిట్టుకున్నారు… కొట్టుకున్నారు.. కేసులు కూడా పెట్టుకున్నారు. కానీ.. మళ్లీ ఒకటయ్యారు. కలిసుంటారు లే అనుకున్న పెద్దలకు ఊహించని షాక్‌ తగిలింది..!! ఈసారి జరిగిన గొడవ ఏకంగా భార్యను హత్య చేసే వరకు వెళ్లింది. హత్య కూడా మామూలుగా కాదు… చంపి, ఆపై ముక్కలుగా నరికి.. మూట కట్టి మూసీలో వేశాడు. హర్రర్‌ క్రైమ్‌ కథా చిత్రాన్ని తలదన్నేలా ప్లాన్‌ చేసి మరీ చంపాడు.

వికారాబాద్‌ జిల్లా కామారెడ్డిగూడకి చెందిన స్వాతి అలియాస్‌ జ్యోతిది యాదవ సామాజిక వర్గం. అదే గ్రామానికి చెందిన సామల మహేందర్‌ రెడ్డి.. స్వాతి ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకుని వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి. కానీ.. పెద్దలను ఎదిరించారు. పెళ్లి చేసుకున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుని.. తమను కాదన్న వాళ్లముందే గొప్పగా బతకాలని నిర్ణయించుకుని మకాం హైదరాబాద్‌‌కి మార్చారు. స్వాతి ఓ కాల్‌ సెంటర్‌లో టెలీకాలర్‌గా ఉద్యోగంలో చేరింది. మహేందర్‌రెడ్డి క్యాబ్‌ డ్రైవర్‌గా చేయసాగాడు…

Vijayawada: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఇక సంప్రదాయ దుస్తులు తప్పనిసరి!

వీళ్ల కాపురంలో కొన్నాళ్లకే కలహాలు మొదలయ్యాయి. చీటికిమాటికి గొడవలు పెట్టుకున్నారు. స్వాతిని పలుమార్లు కొట్టాడు మహేందర్‌ రెడ్డి. భర్త చేష్టలతో విసుగెత్తిన స్వాతి.. బ్యాగు సర్దుకుని పుట్టింటికి వెళ్లింది. పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఇద్దరికీ సర్ధిచెప్పిన పెద్దలు.. వాళ్లను సొంతూర్లోనే ఉండాలని సలహా ఇచ్చారు. కొన్నాళ్లపాటు ఊర్లోనే ఉన్న స్వాతి, మహేందర్‌ మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఈసారి స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహేందర్‌రెడ్డిపై 498 కేసు నమోదు చేశారు పోలీసులు. కొన్నిరోజులకు ఇద్దరూ సర్దుకుపోయారు…

స్వాతి గర్భవతి అవడంతో.. ఆనందిస్తాడు అనుకున్న భర్త మహేందర్‌రెడ్డి ఊహించని షాక్‌ ఇచ్చాడు. ఇద్దరం ఉండటానికే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది.. అప్పుడే పిల్లలు ఎందుకు అన్నాడు. స్వాతిని, వాళ్ల కుటంబసభ్యులనూ ఒప్పించి అబార్షన్‌ చేయించాడు. కొన్నాళ్లపాటు ఊర్లోనే ఉన్న స్వాతి, మహేందర్‌రెడ్డి.. తిరిగి హైదరాబాద్‌కి మకాం మార్చారు. స్వాతి మళ్లీ గర్భవతి అయ్యింది. అసలు సమస్య ఇక్కడే మొదలయ్యింది. మహేందర్‌రెడ్డికి అనుమానం పెనుభూతంగా మారింది. నా వల్ల గర్భం రాలేదు.. ఇంకెవరి వల్లనో వచ్చి ఉంటుంది అని అనుమానించాడు. స్వాతితో గొడవ పెట్టుకున్నాడు. స్వాతికి వివాహేతర సంబంధాలు అంటగడుతూ నిత్యం అనుమానించేవాడు. కాల్‌ సెంటర్‌లో పనిచేసే స్వాతి.. ఫోన్‌ కాల్స్‌ మాట్లాడినా.. ఇంకెవరితోనో మాట్లాడుతోందని అనుమానించాడు. గర్భం తీయించుకోవాలని పట్టుబట్టాడు. ఇందుకు స్వాతి ఒప్పుకోలేదు. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు మరింత ముదిరాయి…

ఈనెల 22న తనను చెకప్‌ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లమని కోరింది స్వాతి. అందుకు మహేందర్‌రెడ్డి నిరాకరించాడు. మళ్లీ గొడవ పడ్డాడు. ఈసారి మహేందర్‌రెడ్డి కిరాతకంగా ఆలోచించాడు. ఎలాగైనా భార్య స్వాతిని హత్య చేయాలని ప్లాన్‌ చేశాడు. 22న మేడిపల్లిలోని ఓ హార్డ్‌వేర్‌ షాప్‌ నుంచి ఓ హాక్సా బ్లేడ్‌ కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టాడు. 23న భార్య స్వాతితో ఉద్దేశపూర్వకంగానే గొడవ పెట్టుకున్నాడు. స్వాతిని కొడుతూ.. పీక పిసికి చంపేశాడు. స్వాతి చనిపోయిందని నిర్ధారించుకున్న మహేందర్‌ రెడ్డి.. హాక్సా బ్లేడ్‌తో స్వాతి శరీర భాగాలను వేరు చేశాడు. కాళ్లు, చేతులు, తల వేరు చేసి కవర్లలో వేశాడు. 4 గంటల వ్యవధిలో 3 సార్లు మూసీ కాలువ వైపు వెళ్లి కవర్లను మూసీ కాలువలో పడేశాడు. ఇక మొండం మాత్రమే మిగిలి ఉంది…

ఇంతలో ఏం ఆలోచించాడో కానీ.. మహేందర్‌రెడ్డి తన చెల్లికి కాల్‌ చేశాడు. స్వాతి తనతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని.. ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదని చెప్పాడు. చెల్లి తన భర్త గోవర్ధన్ రెడ్డికి కాల్‌ చేసి విషయం చెప్పింది. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉండే గోవర్ధన్‌రెడ్డి.. మహేందర్‌రెడ్డికి కాల్‌ చేసి ఇంటికి వస్తున్నాను అని చెప్పాడు. ఇంటికి వస్తే.. ఎక్కడ విషయం బయటపడుతుందోనని.. బయటే కలుద్దాం అని చెప్పాడు. ఇద్దరు కలిసి ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి స్వాతి అదృశ్యమైందని ఫిర్యాదు చేశారు. ఐతే స్వాతి, మహేందర్‌రెడ్డి ఉండే ఏరియా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుండటంతో వాళ్లను మేడిపల్లికి పంపారు పోలీసులు. మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తుండగా.. మహేందర్‌రెడ్డి చెప్తున్న విషయాలకు పొంతన లేకుండా ఉండటం గమనించారు పోలీసులు. మహేందర్‌రెడ్డి మాటలపై అనుమానించారు. ఓసారి ఇంటికి వెళ్లి చూద్దామని వెంటతీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులకు ఊహించని షాక్‌ !! కాళ్లు, చేతులు, తల లేని మొండెం కనిపించింది…

మహేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. తానే భార్య స్వాతిని హత్య చేశాను అని ఒప్పుకున్నాడు. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మొత్తం బాడీని మాయం చేద్దామనుకున్నాను కానీ.. భయమేసిందని చెప్పాడు. అప్పటికే కాళ్లు, చేతులు, తల నరికి మూసీ కాలువలో పడేశానని చెప్పాడు మహేందర్‌రెడ్డి… ఇంట్లో ఉన్న శరీర భాగాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. విషయాన్ని స్వాతి కుటుంబసభ్యులకు తెలిపారు. మేడిపల్లి చేరుకున్న కుటుంబసభ్యుల నుంచి శ్యాంపిల్స్‌ సేకరించి డీఎన్‌ఏ టెస్ట్‌ చేశారు. మృతదేహం స్వాతిదేనని నిర్ధారించి పోస్ట్‌మార్టం చేయించారు.

పక్కా ప్లాన్‌ ప్రకారమే భార్య స్వాతిని మహేందర్‌రెడ్డి హత్య చేశాడని చెప్పారు మల్కాజిగిరి డీసీపీ పద్మజ. హత్య చేయడమే కాకుండా.. మృతదేహాన్ని ముక్కలు చేయాలన్న ఉద్దేశంతోనే హాక్సా బ్లేడ్‌ కొని ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పారు… మరోవైపు స్వాతిని ఇంత దారుణంగా హత్య చేస్తాడని ఊహించలేదంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. నిందితుడు మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.. ఈ కేసులో నిందితుడు మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత రిమాండ్‌‌కు తరలించారు…

Viral Video: రెస్టారెంట్‌లో అమ్మాయి చేయిని కొరికిన రొయ్య.. ఆతరువాత ఏం జరిగిందంటే?

Exit mobile version