Site icon NTV Telugu

Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు

Medaram

Medaram

Medaram Jathara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రాంగణం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ఈ వనదేవతల జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. సుమారు 25.5 కోట్ల రూపాయల భారీ నిధులతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులను అధికారులు అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. 2026లో జరగబోయే మహాజాతర నాటికి భక్తులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు.

Shambala Day 1 Collection: రికార్డులు క్రియేట్ చేసిన ఆది సాయి కుమార్ ‘శంబాల’..

ఆదివాసీ గిరిజన సంప్రదాయాలకు , ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా, వనదేవతల పూజారుల సూచనల మేరకే ఈ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన గద్దెల ప్రాంగణాన్ని భారీగా విస్తరించడమే కాకుండా, పూర్తిగా కృష్ణశిల (గ్రానైట్) రాళ్లతో అద్భుతమైన ప్రాకారాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాల కోసం సుమారు 4,000 టన్నుల గ్రానైట్ రాయిని ఉపయోగిస్తుండటం గమనార్హం. ప్రతి గద్దెకు ఎనిమిది పిల్లర్ల చొప్పున మొత్తం 32 రాతి పిల్లర్లతో గద్దెల ఆధునీకీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దలను కూడా ప్రభుత్వం ఆధునికీకరించి కొత్త రూపునిస్తోంది.

ఈ నిర్మాణంలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఆలయం చుట్టూ నిర్మించిన రాతి గోడలపై ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అద్భుతమైన శిల్పాలను చెక్కుతున్నారు. 7,000కు పైగా చిత్రాల ద్వారా గిరిజనుల పుట్టుపూర్వోత్తరాలు, వారి జీవనశైలి , వనదేవతల చరిత్రను భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు సాధారణ గుడిసెల్లో కొలువైన తల్లులు, ఇప్పుడు ప్రపంచమే అబ్బురపడేలా కళ్లు చెదిరే కళాకృతులతో కూడిన రాతి మందిరాల్లో కొలువుదీరబోతున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖల ప్రత్యేక చొరవతో ప్రభుత్వం మేడారంను ఆధ్యాత్మికంగా , పర్యాటక పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ నూతన హంగులతో 2026 మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి.

Op Sindoor 2.0: పాకిస్తాన్‌లో భయం భయం.. సరిహద్దులకు యాంటీ డ్రోన్ సిస్టమ్స్..

Exit mobile version