NTV Telugu Site icon

Medaram: గిరిజన దేవతల వనప్రవేశం.. ముగిసిన మేడారం జాతర..

తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతర ముగిసింది.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు.. ఇక, భక్తుల నుంచి పూజలందుకున్న గిరిజన దేవతలు వనప్రవేశం చేయడంతో.. మహా జాతర ముగిసింది.. సంప్రదాయం ప్రకారం పూజలు చేసిన అనంతరం అమ్మవార్లకు వీడ్కోలు పలికారు గిరిజన పూజారాలు.. సమ్మక్క, సారలమ్మ వనప్రవేశంతో మహా జాతర ముగిసిపోయింది.. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వనదేవతలను సాగనంపారు.. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నేపల్లికి సారలమ్మను చేర్చారు.. పూనుగొండ్లకు సమ్మక్క భర్త పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజును సంప్రదాయ ప్రకారం పంపించారు..

Read Also: COVID 19: ఏపీ, తెలంగాణలో 400కు దగ్గరగా కేసులు

ఇక, చివరి రోజు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఓ వైపు వీఐపీల తాకిడి.. మరోవైపు భక్తులల తాకిడితో.. మేడారం జనసంద్రంగా మారిపోయింది.. కొద్దిసేపు గద్దెల వద్ద దర్శనాలను నిలిపివేయాల్సి వచ్చింది.. ఆ తర్వాత గద్దెల వద్ద దర్శనాలను పునరుద్ధరించారు. నాలుగు రోజుల పాటు సమ్మక్క, సారలమ్మ జాతర వైభవోపేతంగా సాగింది. ఈ ఏడాది 1.5 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు..