Medak SP Rohini Priyadarshini Reveals Secretariat Employee Dharma Case Details: తన చావుపై డబ్బులు సంపాదించాలనుకున్నాడు, కోట్లకు పడగలెత్తాలని కలలు కన్నాడు, అందుకు తగినట్టుగానే స్కెచ్ వేశాడు కానీ, చివరికి అడ్డంగా దొరికిపోయాడు. ఇది తెలంగాణ సచివాలయ ఉద్యోగి ధర్మా కేసు. తొలుత అతని ప్లాన్ సక్సెస్ అయ్యింది కానీ, ఆ తర్వాత బెడిసికొట్టింది. ఈ కేసుని విచారించిన పోలీసులు, చాకచాక్యంగా వ్యవహరించి ధర్మాతో పాటు అతనికి సహకరించిన నిందితుల్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మీడియాకు వెల్లడించారు. ఆమె మాటల్లోనే..
‘‘జనవరి 9న వెంకటాపుర్‌లో కారు దగ్ధం అయ్యిందని సమాచారం వచ్చింది. అందులో చనిపోయిన వ్యక్తి ధర్మా అని కుటుంబ సభ్యులు చెప్పారు. మేము కూడా ధర్మనే అనుకున్నాం. కానీ, విచారణ సమయంలో ధర్మా బతికి ఉన్నాడని తెలిసింది. దీంతో ఇంకా లోతుగా దర్యాప్తు చేశాం. నిజామాబాద్‌లో ధర్మా బయట తిరుగుతున్న విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్ట్ అయ్యాయి. 2018లో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకొని, షేర్ మార్కెట్‌లో ధర్మ పెట్టుబడులు పెట్టాడు. మొదట్లో చాలా లాభం వచ్చింది. ఆ తర్వాత కరోనా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల షేర్ మార్కెట్ పడిపోయి నష్టాలొచ్చాయి. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సంవత్సరం నుంచి చాలా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. తన పేరు మీదున్న రూ. 7.4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నాటకం ఆడాడు. ధర్మ అక్క సునంద, అల్లుడు శ్రీనివాస్, భార్య నీల, కొడుకు మైనర్ మొత్తం కలిసి ఈ స్కెచ్ వేశారు. కేసులో మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం’’ అని ఎస్పీ రోహిణి చెప్పారు.
ఇంకా మాట్లాడుతూ.. ‘‘మొదట దర్మలాగా ఉన్న వ్యక్తి కోసం నాంపల్లి పొలీస్ స్టేషన్ వద్ద వెతికారు. అక్కడ అంజయ్య అనే వ్యక్తితో ధర్మ పరిచయం చేసుకున్నాడు. నిజామాబాద్‌లో పని ఉందని జనవరి 7న తీసుకెళ్లాడు. అతడ్ని ఎలాగైనా చంపాలనుకున్నారు కానీ.. అంజయ్య తాగి ఉండటంతో వదిలేశారు. అప్పటికప్పుడు నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో బాబు అనే వ్యక్తిని తీసుకొచ్చారు. అతనికి బాసరలో గుండు గీయించి, ధర్మ బట్టలు వేశారు. అదే కారులో వెంకటాపూర్‌కి తీసుకొచ్చారు. చెరువు దగ్గరికి రాగానే, అతడ్ని కారు ముందుకు రమ్మన్నారు. అతడు సహకరించకపోవడంతో.. గొడ్డళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో బాబు చనిపోవడంతో.. అతని మృతదేహాన్ని కారు ముందు పెట్టి, కాలువలోకి తోసేసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు’’ అని కేసు వివరాల్ని ఎస్పీ రోహిణి వెల్లడించారు. నిందితులపై 302, 364, 120B, 201, 202, 212 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.