Edupayala Temple: మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడు పాయల ఆలయం వద్ద సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గడం లేదు. ఏడు పాయల ఆలయం ముందు ఇంకా వరద కొనసాగుతూనే వుంది. 12 రోజులుగా వన దుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. ఆలయం దగ్గర మంజీరా నది ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. సింగూరు ప్రాజెక్టుకి భారీగా వరద వస్తుండటంతో 4 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేసిన అధికారులు. మంజీరా నదిలో సింగూరు జలాలు కలవడంతో అమ్మవారి ఆలయం ముందు మంజీరానది పరవళ్లు తొక్కుతోంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. ఇన్ ఫ్లో- 34918 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో- 40600 క్యూసెక్కులు, ప్రస్తుత నీటి మట్టం- 28.666 టీఎంసీలు, పూర్తి స్థాయి నీటి మట్టం- 29.917 టీఎంసీలు, జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
గతంలో వర్షాకాలంలో అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే వుండడం సర్వసాధారణం. కానీ ఈ ఏడాది అక్టోబర్ నెలలోనూ అమ్మవారిని వరద వీడడం లేదు. దీంతో అమ్మవారి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నిరాశ తప్పడంలేదు. రోజూ వేలాదిమంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. వరద ప్రవాహం ఎక్కువగా వుండడంతో భక్తుల రావద్దని అధికారులు సూచించారు. పచ్చని అడవి, డెన్ లోపల సహజ రాతి నిర్మాణాల మధ్య ఉన్న సుందరమైన మందిరం ఇది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తారు. వర్షాకాలంలో వరద ఆలయంలోపలికి ప్రవశిస్తుంది. దుర్గభావానీ పాదానికి చేరుకుంటుంది. ఈ అద్భుతమైన సంఘటనను చూడటానికి వేలాది మంది భక్తులు ఏడుపాయలకు వస్తుంటారు. కానీ ఈసారి ఆలయం ఎక్కువగా వరద నీటిలోనే ఉండిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో వరద నీటి సవ్వడి తప్ప భక్తుల సందడి కనిపించడం లేదు.