Site icon NTV Telugu

తెలంగాణలో సంస్మరణ సభను నిర్వహించుకునే హక్కు కూడా లేదా?:

మావోయిస్ట్ పార్టీ ప్రముఖ నేత ఆర్కే భార్య శిరీష తెలంగాణ పోలీసులపై విమర్శలు చేశారు. ఆర్కేపై వచ్చిన కథనాలను, ఇంటర్వ్యూలను సేకరించి తాను బుక్ తయారుచేసి హైదరాబాద్‌లో ఆవిష్కరించాలని భావించానని…మీడియాలో వచ్చిన కథనాలను మాత్రమే పుస్తకంలో ప్రస్తావించానని, కానీ ఆ పుస్తకావిష్కరణను పోలీసులు అడ్డుకున్నారని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పుస్తకంలో ఎటువంటి విప్లవ సాహిత్యం లేదన్నారు. పుస్తక ఆవిష్కరణ కోసం డీజీపీ దగ్గర అర్జీ పెట్టుకున్నానని, ఆ తరువాత రోజే పుస్తకం ప్రింట్ చేస్తున్న ప్రెస్‌పై పోలీసులు దాడి చేశారని తెలిపారు. పోలీసులు పుస్తకాలను తీసుకెళ్లి ప్రెస్ యజమానిపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.

Read Also: ఎన్టీఆర్ షోలో రూ.కోటి గెలుచుకున్న తెలంగాణ బిడ్డ

అసలు ‘సాయుధ శాంతి స్వప్నం’ పుస్తకంలోని విషయాలన్నీ బహిర్గతమైనవేనని, అందులో నిషేధిత అంశాలు ఏమున్నాయని శిరీష ప్రశ్నించారు. ఈనెల 14న ఆర్కే సంస్మరణ సభ జరగవలసిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చి కార్యక్రమాన్ని అడ్డుకున్నారని శిరీష ఆరోపించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ప్రజలు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. పుస్తకాలను బందీ చేయగలరేమో కానీ భావాలను మాత్రం బంధించలేరని ఆమె స్పష్టం చేశారు. పుస్తకాలను తిరిగి ఇచ్చి పుస్తకావిష్కరణ జరుపుకునేలా అనుమతి ఇవ్వాలని శిరీష డిమాండ్ చేశారు.

Exit mobile version