NTV Telugu Site icon

Nizamabad: చాయ్‌ కోసం బస్సు ఆపితే.. కెమెరాకు చేయి అడ్డుపెట్టి 13 లక్షలు కొట్టేసారు

Venus Travels

Venus Travels

Nizamabad: ఓ ప్రైవేట్ బస్సులో సినీమా స్టైల్లో చోరీ జరగడం సంచలనంగా మారింది. టీ తాగడం కోసం బస్సు ఆపితే.. అదే సమయంలో 13 లక్షలు ఉన్న బ్యాగుతో ఉడాయించారు.దీంతో బ్యాగ్ యజమాని లబోదిబో మన్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సారంగాపూర్‌లో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ బస్సులో భారీ చోరీ జరగడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ముంబై నుంచి జగిత్యాల వెళ్తుండగా నగర శివారులో చోరీ జరిగింది.

Read also: Palakurthy Tikkareddy: ఈ సారి మంత్రాలయం టికెట్‌ నాదే.. గెలుపు నాదే..

జగిత్యాల జిల్లాకు చెందిన హన్మంతు ముంబైలోని ఓ తాడి బట్టీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆ బట్టీ యజమాని కూడా జగిత్యాలకు చెందినవాడు. సంక్రాంతి పండుగకు ముంబయి నుంచి హన్మంతు జగిత్యాలకు వస్తుండగా.. బట్టీ యజమాని హన్మంతుకు రూ.13 లక్షలు ఇచ్చి తన ఇంట్లో ఇవ్వాలని చెప్పాడు. హన్మంతు డబ్బు తీసుకుని శనివారం మధ్యాహ్నం ముంబైలోని ఓ ప్రైవేట్ బస్సు ఎక్కాడు. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలోని భవానీ హోటల్ వద్ద టీ తాగేందుకు డ్రైవర్ బస్సును ఆపాడు. అదే సమయంలో డబ్బున్న బ్యాగును సీటుపై పెట్టి హన్మంతు కిందకు దిగాడు. సుమారు అరగంట పాటు బస్సు ఆగిన తర్వాత ఇదే అవకాశంగా భావించిన దుండగులు సీటుపై ఉన్న బ్యాగుతో పరారయ్యారు.

Read also: Supreme Court: జీతం రాలేదంటూ సుప్రీంకోర్టులో పాట్నా హైకోర్టు న్యాయమూర్తి ఆవేదన

బస్సు కదులుతుండగా హన్మంతు వచ్చి చూడగా సీటుపై డబ్బు బ్యాగ్ కనిపించలేదు. చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే బస్సు డ్రైవర్‌కు చెప్పి పోలీసులకు సమాచారం అందించారు. సౌత్ రూరల్ సీఐ వెంకట నారాయణ, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ముసుగు ధరించిన దుండగుడు బస్సులోని సీసీ కెమెరాకు చేయి అడ్డుపెట్టి డబ్బు ఉన్న బ్యాగును తీసుకెళ్తున్నట్లు బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. నిందితులతో పాటు వచ్చిన మరో ఇద్దరు కూడా బస్సు డోర్ వద్ద నిలబడి ఉన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆరో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. చోరీ జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బస్సులో ప్రయాణించే వ్యక్తులు చోరీ చేశారా..? బయట వ్యక్తులు చోరీ చేశారా? అనే కోణం లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
Palakurthy Tikkareddy: ఈ సారి మంత్రాలయం టికెట్‌ నాదే.. గెలుపు నాదే..