TPCC Mahesh Goud : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయ చర్చలు వేడెక్కాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం తెలంగాణ జన సమితి (టీజేఎస్) కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్‌ను కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలన్న అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
కోదండరామ్‌తో జరిగిన సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావంలో కోదండరామ్ పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆయన నిస్వార్థంగా, నిజాయితీతో రాష్ట్ర సాధన కోసం కృషి చేశారని గుర్తుచేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఎలా నిరంకుశంగా మారిందో అందరికీ తెలుసని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆ పాలన నుంచి విముక్తి కోసం కాంగ్రెస్, టీజేఎస్ సహా ప్రజాసంఘాలన్నీ కలిసి 2023 ఎన్నికల్లో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. “కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో టీజేఎస్ సహకారం ఎంతో విలువైనది. దాన్ని మేము ఎప్పటికీ మరవం,” అని తెలిపారు.
ఉద్యోగ నియామక రూపకల్పనలో కోదండరామ్ సలహాలు, సూచనలు ఎంతో విలువైనవని మహేష్ గౌడ్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగుతుందని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో యువ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని టీజేఎస్‌ను కోరారు. సీపీఐ, సీపీఎం, ఏఐఎంఐఎం మాదిరిగా టీజేఏసీ మద్దతు కూడా కోరినట్లు తెలిపారు.
ఇక బీజేపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డ ఆయన… “కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ ఏమి మాట్లాడుతున్నారో తనకే అర్థమవుతున్నదా? మత విద్వేషాలు రెచ్చగొట్టి, సెంటిమెంట్లు రాజేసి లబ్ధి పొందాలన్నదే బీజేపీ పన్నాగం,” అని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మతవాద శక్తులకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. మిత్రపక్షాలతో ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగుతుందని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.
