Site icon NTV Telugu

Local Body Elections : తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం..

Local Body Elections

Local Body Elections

Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. గురువారం జరగనున్న తొలి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగేలా విస్తృత చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలి విడతలో మొత్తం 189 మండలాలు, 4,236 గ్రామపంచాయతీలు, 37,440 వార్డులు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, తొలి విడతలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళలు, 201 మంది ఇతరులు ఉన్నారు.

ఎన్నికల నిర్వహణ కోసం సుమారు లక్ష మంది ఎన్నికల సిబ్బందిని నియమించామని కమిషనర్ తెలిపారు. ఇందులో 3,591 మంది రిటర్నింగ్ అధికారులు (ROs), 93,905 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. అలాగే ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు 2,489 మైక్రో ఆబ్జర్వర్లను (మూడు దశల కోసం) నియమించారు. పారదర్శకత కోసం 3,461 పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 45,086 బ్యాలెట్ బాక్సులు వినియోగించనున్నారు. ఓటర్ సౌలభ్యం దృష్ట్యా 99 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయ్యిందని కమిషనర్ వెల్లడించారు. మిగతా ఓటర్లు ‘టీఎస్ ఈ-పోల్ మొబైల్ యాప్’ ద్వారా కూడా తమ ఓటర్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ఓటింగ్ కేంద్రం తెలుసుకునేందుకు అదే యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు.

ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఇప్పటివరకు 3,214 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా.. 31,428 మందిని బైండోవర్ చేసినట్లు, 902 లైసెన్స్డ్ ఆయుధాల డిపాజిట్, రూ.7.54 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన లోహాల స్వాధీనం చేసినట్లు రాణి కుముదిని వెల్లడించారు. నిన్న సాయంత్రం నుంచే మద్యం దుకాణాలు మూసివేశామని ఆమె తెలిపారు. భద్రతా చర్యలలో భాగంగా 31 జిల్లాల అధికారులకు మేజిస్ట్రేట్ పవర్స్ ఇచ్చామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు.

ఎన్నికల ప్రచారం కూడా నిన్న సాయంత్రం 5 గంటలతో ముగిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ, భయభ్రాంతులు లేకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య బలోపేతంలో ఓటు కీలకమని పేర్కొంటూ, గ్రామాల భవిష్యత్తు నిర్ణయంలో ఓటు శక్తిని గుర్తించాలని ఆమె అన్నారు.

Sanju Samson: అయ్యయ్యో ఎంతపనాయే.. సంజుకు ఇక ఐపీఎలే ఏ దిక్కా?

 

Exit mobile version