NTV Telugu Site icon

MLA Raja Singh: కలిసి సినిమా చూద్దాం రండి.. కేటీఆర్ కు రాజాసింగ్ ఆహ్వానం

Mla Rajasingh

Mla Rajasingh

MLA Raja Singh: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రజాకార్ సినిమా టీజర్ రాజకీయ వివాదాలకు వేదికగా మారింది. ఈ సినిమాపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించిన విషయం తెలిసిందే. అయితే కేటీఆర్ ట్వీట్ కు రాజాసింగ్ స్పందించారు. మీరు, మేము కలిసి (రాజాకార్) సినిమా చూద్దాం రండి అంటూ కేటీఆర్ కు ఎమ్మేల్యే రాజాసింగ్ ఆహ్వానం పలికారు. టీజర్ కే భయపడి నిజాం వారసులు ఏదేదో కామెంట్ చేస్తున్నారని వ్యంగాస్త్రం వేశారు. ట్విట్టర్ మెన్ సెన్సార్ బోర్డ్ కి, పోలీసులకు లేఖ రాస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. బీజేపీ జోకర్ కాదు.. హీరో అంటూ తెలిపారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ అరాచకాల గురించి మీ నాన్న మీకు చెప్పలేదా? అంటూ ప్రశ్నించారు. మూవీ చూసిన తర్వాత సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో డిసైడ్ అయితే బాగుంటుందని కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో రిలీజ్ చేశారు.

ఇక తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలై వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. 1948లో నిజాం ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. పోలీసుల చర్యగా… ముస్లింలు పెద్ద నేరస్తులన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ టీజర్ చూసిన నెటిజన్లు, మత పెద్దలు, రాజకీయ పార్టీల నేతలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమా తీశారని విమర్శించారు. రాజకీయాల కోసం తప్పుడు సినిమాలు తీస్తే జనం నమ్మరని పేర్కొన్నారు. కాగా, ఇదే అంశంపై తాజాగా మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. “కొందరు తెలివి విషయంలో దివాళా తీసిన బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణలో మత విద్వేషాలు సృష్టించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని, రజాకార్ సినిమా విషయాన్ని సెన్సార్ బోర్డు దృష్టికి తీసుకెళ్తాం.. శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా తెలంగాణ పోలీసులు కూడా చూసుకుంటారు అని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో.. బండి సంజయ్, రాజాసింగ్ స్పందించడంపై ఆశక్తి నెలకొంది.