Kunamneni Sambasiva Rao Fires On Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఘాటుగా స్పందించారు. చట్టాల మీద, వ్యవస్థ మీద నమ్మకం లేని వ్యక్తి బండి సంజయ్ అని.. ఆయన అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికినప్పటికీ.. బుకాయింపులు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు తనకు సంబంధం లేని విషయంపై బండి సంజయ్ ఎందుకు మాట్లాడుతున్నాడు? అని ప్రశ్నించారు. ఢిల్లీ డీల్‌కు నువ్వెందుకు ప్రమాణాలు చేస్తున్నావు? అని నిలదీశారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే.. ప్రధాని మోడీతో ప్రమాణం చేయించు అని బండి సంజయ్‌కి సవాల్ విసిరారు.
మీకు భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదని.. కేవలం మతం పేరుతో రాజకీయం చేస్తున్నారని సాంబశివ రావు వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీలు వేల కోట్లు తీసుకున్నారని బండి సంజయ్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని.. బీజేపీని గద్దె దించేందుకే తాము లౌకిక శక్తులతో పోరాటం చేసేందుకు టీఆర్ఎస్‌తో కలిశామని వివరణ ఇచ్చారు. తమ పొత్తు మీద ప్రశ్నిస్తున్న మీరు.. టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? వారికి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? అని ప్రశ్నించారు. మీరు చేస్తే సంసారం.. మీము పొత్తు పెట్టుకుంటే తప్పా? అని అడిగారు. సీబీఐ ఒక గవర్నర్ వ్యవస్థలా తయారైందని, చాలా రాష్ట్రాలు సీబీఐని బహిష్కరించాయని అన్నారు. అందులో భాగంగానే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోకి సీబీఐ అనుమతి లేదని జీవో తీసుకొచ్చిందన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎన్నికల బరిలో ఉంటామని ప్రమాణం చేయగలరా? అని సాంబశివ రావు ప్రశ్నించారు. మీరు ఎన్నికల కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసి అయినా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయవచ్చా? అని నిలదీశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత అక్కడ ప్రజలపై ఉందని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ తప్పు చేయరని, సిద్ధాంతాల ప్రకారమే తమ పోరాటాలు ఉంటాయని అన్నారు. ప్రజల కోసమే కమ్యూనిస్టులు నిరంతరం పని చేస్తారన్నారు.
బండి సంజయ్ ఒక రాజకీయ అజ్ఞాని, ఒక మూర్ఖుడని.. నోటికి ఏది వస్తే అది మాట్లాడి మీడియాలో హైలెట్ కావాలని అనుకుంటున్నాడని సాంబశివ రావు ధ్వజమెత్తారు. ఏ విషయంపై కూడా ఆయనకు సరైన అవగాహన లేదని, రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం ఆయన్ను ఎలా నియమించిందో తెలియదని ఎద్దేవా చేశారు. తడి బట్టలతో ప్రమాణం చేస్తే అన్ని మాఫీ అయిపోయేట్టు ఉంటే ఇక కోర్టులు ఎందుకు? అని అన్నారు. వామపక్షాలపై బండి అవాకులు చెవాకులు పేలుతున్నారని, మా సిద్ధాంతాల ప్రకారం మేము నడుచుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? సాంబశివ రావు నిలదీశారు.