NTV Telugu Site icon

Minister KTR: నేడు మంచిర్యాలలో కేటీఆర్‌ పర్యటన.. ఠాగూర్‌ స్టేడియంలో బహిరంగ సభ

Ktr

Ktr

Minister KTR: మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మందమర్రి మున్సిపాలిటీ, క్యాతంపల్లి మున్సిపాలిటీల్లో రూ.312.96 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీంతో పాటు రూ.500 కోట్లతో చేపట్టనున్న ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి భూమిపూజ చేయనున్నారు. మందమర్రిలో భారీ రోడ్ షో, రామకృష్ణాపూర్ లో ప్రగతి నివేదన సభలో మంత్రి పాల్గొంటారు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మందమర్రికి చేరుకుంటారు.

భీమారం మండల పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.14.53 కోట్లతో నిర్మించనున్న రోడ్లు, బ్రిడ్జిల పనులను, చెన్నూరు నియోజకవర్గంలో రూ.20.40 కోట్లతో నిర్మించనున్న పది రోడ్ల పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం రూ.11.70 కోట్లతో పులిమడుగు, అందుగులపేట, సంద్రుంపల్లి వద్ద పాలవాగుపై వంతెనలు, చెన్ను పక్కన అక్కెపెల్లి వాగుపై బ్రిడ్జి కమ్ చెక్ డ్యాంల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మందమర్రి మండలం శంకరపల్లిలో రూ.500 కోట్లతో నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీకి భూమిపూజ చేయనున్నారు. మందమర్రి మున్సిపాలిటీలో రూ.204.8 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం అనంతరం మార్కెట్ చౌరస్తాలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్ షో ముగిసిన అనంతరం క్యాత్నపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.50 కోట్లతో గాంధారి వనం సమీపంలో 250 ఎకరాల్లో నిర్మించనున్న కేసీఆర్ అర్బన్ పార్కు పనులకు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేయనున్నారు. మున్సిపాలిటీలో మొత్తం రూ.108.16 కోట్ల పనులు ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడనున్నారు.