KTR: వ్యక్తులకు ఇగో ఫీలింగ్ ఉంటుంది. ఓ రేంజ్‌లో ఉన్నోళ్లు కూడా దీన్ని ప్రదర్శిస్తుంటారు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్సీపీ పేరును పూర్తిగా ప్రస్తావించరు. వైకాపా అని గానీ వైసీపీ అని గానీ క్లుప్తంగా అంటుంటారు. వైఎస్సార్సీపీ అనే పూర్తి పేరును పదే పదే పలకటం ద్వారా ఆ పార్టీకి అనవసరంగా ప్రచారం, ప్రజాదరణ కల్పించటం దేనికి? అనేది వాళ్ల ఇగో ఫీలింగ్. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనే పేరును సైతం పూర్తిగా పేర్కొనరు. జగన్‌రెడ్డి అంటూ వెటకారం చేస్తుంటారు. ఈమధ్య మరీ జగన్’మోసపు’రెడ్డి అని విమర్శిస్తున్నారు.
ఇదంతా ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ మంత్రి కేటీఆర్ నిన్న బండి సంజయ్ మీద ఒక సెటైర్ వేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైన ఆయన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి చీఫ్‌గా నియమించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని, ఆయనపై ఈడీ దర్యాప్తు ఖాయం అంటూ బండి సంజయ్ ప్రకటన చేయటంతో దానికి కౌంటర్‌గా కేటీఆర్ ఈ పోస్టింగ్ పెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ బండి సంజయ్ కుమార్ పేరును షార్ట్ కట్‌లో “బీఎస్ కుమార్” అని వెరైటీగా రాశారు.
read also: Meena Sagar: భర్త చనిపోయాక మొదటిసారి అక్కడ కనిపించిన మీనా..
బండి సంజయ్ అనే పేరు ప్రస్తుతం తెలంగాణలో బాగానే పాపులర్ అయింది కాబట్టి దాన్ని అచ్చం అలాగే మెన్షన్ చేయటం కేటీఆర్‌కి ఇష్టంలేక కావాలనే ఇలా సంక్షిప్త పదం కనిపెట్టారు. ‘ఈడీకి చీఫ్‌గా నియమించారు’ అని జోక్‌గా అనటం కూడా మస్తు పేలింది. ఏది ఏమైనా నిజాన్ని ఒప్పుకోవాలి. మాటకారితనంలో కేటీఆర్.. తండ్రి కేసీఆర్‌కి తగిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారని చెప్పొచ్చు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అసలు విషయానికొస్తే.. ‘కేసీఆర్‌పై ఈడీ దర్యాప్తు’ విషయంలో బండి సంజయ్ నిన్న మళ్లీ మరో ప్రకటన చేశారు.
‘దర్యాప్తు సంస్థలు తలుపుతట్టే వరకు ఊపిరి పీల్చుకో కేసీఆర్’ అంటూ బాహుబలి-2 ఇంటర్వెల్ లెవల్‌లో బండి సంజయ్ హెచ్చరించారు. రాజకీయంగా చూస్తే ‘కేసీఆర్‌పై ఈడీ దర్యాప్తు’ అనే విషయంలో బండి సంజయ్ చేస్తున్న ప్రకటనలు కరెక్ట్ కావొచ్చేమోగానీ ప్రభుత్వంపరంగా చూస్తే మాత్రం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే దీన్ని ఒకరకంగా బెదిరింపు ధోరణిగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్థానిక ప్రభుత్వాన్ని ఇలా టార్గెట్ చేయటం సమంజసం కాదని చెబుతున్నారు.
కేసీఆర్ సర్కారు చేస్తున్న అవినీతి పైన, కుంభకోణాల పైన ఈడీ, సీబీఐ దర్యాప్తు చేయాలి, దర్యాప్తు చేయాలని మేం కోరతాం అనే ప్రకటనలు చేయొచ్చు గానీ త్వరలో దర్యాప్తు ప్రారంభంకాబోతోంది అంటూ ఈడీ ప్రతినిధి మాదిరిగా మాట్లాడకూడదని అంటున్నారు. ఇలాంటి స్టేట్‌మెంట్లే బీజేపీ ప్రత్యర్థులకు రాజకీయ విమర్శనాస్త్రాలుగా మారుతున్నాయని పేర్కొంటున్నారు. కమలనాథులు చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కారంటే ‘ఈడీ-మోడీ’యే తప్ప మరొకటి కాదని కాషాయం పార్టీకి టీఆర్‌ఎస్ నేతలు చురకలు వేయటానికి బండి సంజయ్ లాంటివాళ్లు చేస్తున్న ఈ ప్రకటనలు దారితీస్తున్నాయని గుర్తుచేస్తున్నారు.